YSRCP Leader Anarchists in Parchur : పర్చూరులో పాగా వేసేందుకు ఓ అరాచక నేత అక్రమాలకు పాల్పడుతూ దోచిన మొత్తంలో పోలీస్‌స్టేషన్లకే నెలవారీ వాటాలు పంపుతున్నాడు. ప్రైవేటు సైన్యంతో తన అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో అధికార పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు పర్చూరును మరో పుంగనూరు, మాచర్లగా మార్చేలా ఆ అరాచక నేత పావులు కదుపుతున్నాడు. అతని అండ చూసుకుని వైఎస్సార్సీపీ కిందిస్థాయి నాయకులు చెలరేగిపోతున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఒక తహసీల్దారు బ్రెయిన్‌స్ట్రోక్ బారినపడగా.. మరో ఉద్యోగి గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్నారంటే ఆ నేత ఏ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారో స్పష్టమవుతోంది.
Votes Remove From Voters List in Parchur :తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న పర్చూరులో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని అరాచకాలకు మారుపేరుగా నిలిచిన ఆ కీలక నేతను అక్కడకు తీసుకొచ్చారు. ప్రత్యర్థుల ఓట్లు తొలగించేలా పక్కాగా ప్రణాళిక అమలు చేశారు. ఓటరు జాబితాను వైఎస్సార్సీపీ ఓట్ల జాబితాగా మార్చేసే స్థాయిలో అక్రమాలకు తెరతీశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు ఓ ప్రైవేట్ సైన్యాన్నే ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారితో 14 వేలకు పైగా ఫారం-7 దరఖాస్తులను సిద్ధం చేయించారు.
Removal Votes in Parchur: పర్చూరు ఓట్ల దొంగలపై చర్యలకు అధికారులు మీనమేషాలు
న్యాయస్థానం ఆదేశాలు.. ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు సస్పెండ్ : గుర్తు తెలియని ఒక వ్యక్తి 18 సిమ్ కార్డులు వినియోగించి ఫారం-7 దరఖాస్తులను నమోదు చేసినట్లు ఈఆర్వో మూడు రోజుల కిందట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఫారం-7లలో ఇచ్చిన ఓట్లన్నింటినీ తొలగించారా లేదా అని చూసే బాధ్యతను ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలకు అప్పగించారంటే ఆ నాయకుడు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటరు జాబితా సవరణలో అక్రమాల వ్యవహారం హైకోర్టుకు చేరడంతో.. న్యాయస్థానం ఆదేశాలతో ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు సస్పెండయ్యారు. దీంతో ఆ నేత ఒత్తిడితో నిబంధనలు అతిక్రమించిన అధికారులు తమపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని బిక్కుబిక్కుమంటున్నారు.
Application for Form-7 Mostly with SCs :తాను చేసే అక్రమాలకు ఎస్సీలను పావులుగా వినియోగించడం ఆ అరాచక నేతకు అలవాటు. ఇప్పుడు ఫారం-7 నకిలీ దరఖాస్తులను కూడా ఎక్కువ శాతం ఎస్సీలతోనే చేయించారు. అనంతవరంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎస్సీ ప్రతినిధి 208 ఫారం-7 దరఖాస్తులను సమర్పించినట్లు ఒక అధికారి నివేదిక సిద్ధం చేశారు. ముఖ్య నేత మనుషులు ఆ అధికారిపై ఒత్తిడి తెచ్చి 208 మంది వ్యక్తిగతంగానే దరఖాస్తులు సమర్పించినట్లుగా నివేదికను మార్పించినట్లు సమాచారం. ఒక ఎస్సీ సర్పంచి కూడా ఇలా దరఖాస్తులను సమర్పించారు. ఒక జెడ్పీటీసీ మెంబర్ కుటుంబ సభ్యుడు 150 దరఖాస్తులను సమర్పించినట్లు సమాచారం.