YCP Leaders Meeting Against Amanchi Krishna Mohan: బాపట్ల జిల్లా పర్చూరులో పలువురు వైసీపీ నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌పై సొంతపార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆమంచికి వ్యతిరేకంగా పలువురు నేతలు సమావేశం నిర్వహించడం ప్రస్తుతం నియోజకర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌పై అసమ్మతిగళం వినిపిస్తున్న ఆ పార్టీ నాయకులు.. ఈమేరకు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు.. ప్రశాంతంగా ఉండే పర్చూరు నియోజకవర్గంలో ఆమంచి ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమదందాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. సొంత పార్టీ నాయకులనే ఆమంచి ఇష్టమొచ్చినట్లు దూషిస్తున్నారని అసమ్మతి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ అధిష్ఠానం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే తమ సత్తా చూపుతామని స్పష్టం చేశారు. ఆమంచి తీరును నిరసిస్తూ చినగంజాం మండలానికి చెందిన పలువురు నాయకులు పెదగంజాంలో సమావేశమయ్యారు. చినగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండలం నుంచి సుమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
మొదటి నుంచి పార్టీలోనే ఉంటూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న నేతలంటే పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్‌కు గౌరవం లేదని.. ఎంతటి నాయకులనైనా దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటెద్దుపోకడతో నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నాడని అసమ్మతి నేతలు ఆరోపించారు 'ఆమంచి వద్దే వద్దని చెప్పిన నేతలు.. త్వరలో మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తామని చెప్పారు. చీరాలకు చెందిన ఆమంచి అనుచరులు వైసీపీ సర్పంచ్‌ను సైతం మామూళ్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారన్నారు.