Votes Deletion in AP: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఈ సారైనా పాగా వేయాలని వైసీపీ పన్నుతున్న కుట్రలు బట్టబయలవుతున్నాయి. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అడ్డగోలు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గంలో వేలకొద్దీ దొంగ ఓట్లు ఉన్నాయని ప్రచారం చేసిన వైసీపీ నేతలు.. ఓటర్ల జాబితా సవరణ పేరిట ఆన్‌లైన్‌లో ఫారం-7 దరఖాస్తులు చేశారు. పర్చూరు మండలంలో 14 వేలకు పైగా ఫారం-7 దరఖాస్తులు రాగా, కారంచేడు మండలంలో 2 వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో ఒక్క స్వర్ణ గ్రామంలోనే 250 ఓట్లు తొలగించాలని ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి.
Opposition Sympathizers Votes Removed in Parchur Constituency: అధికారపార్టీకి చెందిన 124 మంది ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఒక్కొక్కరు 20 నుంచి 200 మేర ఫాం-7 దరఖాస్తులు చేశారు. అవన్నీ టీడీపీ సానుభూతిపరుల ఓట్లు. స్వర్ణ గ్రామంలో ముత్యాల రామారావు అనే వైసీపీ కార్యకర్త, రేషన్ డిపో డీలర్ దగ్గర తాము నెలనెలా రేషన్ బియ్యం తీసుకుంటున్నామని మరి అతనే.. తన ఓటు తొలగించమని ఎలా దరఖాస్తు చేశాడని స్వర్ణ గ్రామానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తి ప్రశ్నించారు.
Votes Deletion in Parchur Constituency: ఎన్నోసార్లు ఓట్లు హక్కు వినియోగించుకున్న వారి ఓట్లు సైతం తొలగింపు దరఖాస్తులు చేశారని.. తాము ఇక్కడే ఉంటున్నా తమ ఓట్లు ఎలా తొలగిస్తారని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ ఓటమి భయంతోనే.. టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని.. దానికి అధికారపార్టీ అండతో అధికారులు నామమాత్రంగా విచారణ చేస్తున్నారని స్వర్ణ గ్రామస్థులు వాపోయారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.