Viswanath Native Village: ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ మృతితో ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కె.విశ్వనాథ్ పదేళ్ల వయసు వచ్చే వరకూ వారి కుటుంబం పెదపులివర్రులో నివాసం ఉండేది. ఆ తరువాత వారి కుటుంబం విజయవాడ వెళ్లిపోయిందని ఆయన స్నేహితులు తెలిపారు. విజయవాడలో విశ్వనాథ్ తండ్రి సినిమా థియేటర్ మేనేజర్‌గా పని చేసేవారు. విశ్వనాథ్ ఉన్నత చదువులు విజయవాడలోనే సాగాయి. తర్వాత విశ్వనాథ్ తండ్రికి బి.యన్ రెడ్డితో పరిచయంతో సినిమా ఫీల్డ్కి పంపించారన్నారు. విశ్వనాథ్ తాను చిన్నప్పుడు బాగా స్నేహంగా ఉండేవాళ్లమని గ్రామానికి చెందిన సుబ్బారావు తెలిపారు. విశ్వనాథ్ నివసించిన ఇంటిని ఆ తర్వాత కాలంలో సజ్జ బసవపున్నయ్య కొనుక్కున్నారు. ఆ ఇల్లు కొనుక్కున్నాక ఆయనకి బాగా కలిసి వచ్చిందన్నారు. విశ్వనాథ్ మృతికి విచారం వ్యక్తం చేశారు. దర్శకుడిగా మారిన తర్వాత కొన్నిసార్లు పెదపులివర్రు వచ్చారన్నారు. ప్రస్తుతం విశ్వనాథ్ కుటుంబానికి సంబంధించిన వారు ఎవరూ గ్రామంలో లేరు.
"వాళ్ల పొలాలన్నీ మా తాత గారే పండించి వ్యవసాయం చేసేవారు. ఈ ఇల్లు కొన్న తరువాత నాకు ఉద్యోగం వచ్చింది. ఆయన దయ వలన మాకు బాగా కలసి వచ్చింది". - సజ్జ బసవపున్నయ్య, గ్రామస్థుడు