కరెంటు కోతలు ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాత్రి వేళల్లో మూడునాలుగు గంటలు విద్యుత్ కోతలు తప్పనిసరిగా మారడంతో బాపట్ల జిల్లాలో ఆక్వారైతులు చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆక్సిజన్ అందకపోతే చేపలు, రొయ్యలు గుడ్లు తేలేసే ప్రమాదం ఉండటంతో రైతులు ఏరియేటర్ల కోసం జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. బాపట్ల జిల్లాలో అధికారికంగానే 22వేల హెక్టార్ల చెరువుల్లో ఆక్వా సాగు జరుగుతుండగా... రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. రొయ్యలు, చేపలు చనిపోకుండా కాపాడుకునేందుకు ఏరియేటర్లు వినియోగం తప్పనిసరి కావడంతో... పెరిగిన డీజిల్ ఖర్చులు రైతులకు పెనుభారంగా మారాయి.
అప్రకటిత విద్యుత్తు కోతలు.. ఆక్వా రైతుల అవస్థలు - ఆక్వా రైతుల అవస్థలు
అప్రకటిత విద్యుత్తు కోతలతో బాపట్ల జిల్లాలోని ఆక్వా రంగం కుదేలవుతోంది. సకాలంలో ప్రాణవాయువు అందక రొయ్య ఉక్కిరిబిక్కిరవుతోంది. చేపల్ని కాపాడుకునేందుకు జనరేటర్ల ద్వారా ఏరియేటర్లు వినియోగించడంతో రైతులపై మోయలేని భారం పడుతోంది. మరోవైపు ప్రాసెసింగ్ ప్లాంట్లకూ విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. పెరిగిన కరెంట్ ఛార్జీలు, డీజిల్ ధరలతో నష్టాలే తప్ప కష్టానికి ప్రతిఫలం దక్కేలా లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు.
రొయ్యలు
చెరువు నుంచి రొయ్యలు పట్టిన తర్వాత నిల్వ చేయాలంటే ఐస్ తప్పనిసరి. ప్రాసెసింగ్ ప్లాంట్‌కు తీసుకెళ్లాలన్నా... అక్కడి నుంచి ఎగుమతి చేయాలన్నా ఐస్ కావాల్సిందే. కిలో రొయ్యలకు 5 కిలోల ఐస్ అవసరం. కరెంటు కోతలతో ఐస్ తయారీకి సైతం ఇబ్బందులు తప్పటం లేదు. అప్రకటిత కరెంటు కోతలు ఆక్వాతో పాటు అనుబంధ రంగాల ఉపాధికి గండికొడుతున్నాయి. కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.