ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అపురూప దృశ్యం.. భావనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు - చినగంజాం మండలంలో భావనారాయణ స్వామి దేవాలయం న్యూస్

Bhavanarayana Swamy Temple: బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి ఆలయంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. లేలేత సూర్య కిరణాలు స్వామి వారి మూలవిరాట్టును తాకాయి. ప్రతి ఏటా మార్చి, అక్టోబర్‌ మొదటి వారాల్లో మాత్రమే సూర్యకిరణాలు నేరుగా భావనారాయణస్వామిని తాకే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.

sunrays touch feet of bhavanarayana swamy
భావనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

By

Published : Mar 8, 2023, 3:03 PM IST

భావనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

Bhavanarayana Swamy Temple: బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని పెదగంజాంలోని భావనారాయణ స్వామి ఆలయంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. లేలేత సూర్య కిరణాలు కాంతిని విరజిమ్ముతూ.. భావనారాయణ స్వామి మూలవిరాట్టును తాకాయి. భానుడి కిరణాలు తాకి బంగారు ఛాయలో మెరిసిపోయిన భావనారాయణ స్వామిని చూసిన భక్తులు పరవశించిపోతున్నారు. ఏటా మార్చి, అక్టోబర్‌ మొదటి వారాల్లో మాత్రమే సూర్యకిరణాలు ఇలా నేరుగా స్వామి పాదాలను తాకుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామపెద్దలు చర్యలు చేపట్టారు. సూర్యోదయానికి ముందే గుమికూడిన భక్తులు.. దేవుడి పాదాలను తాకుతున్న కాంతిని చూసి పరవశించిపోయారు. అనంతరం భక్తులు భావనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్థల పురాణం: త్రేతాయుగంలో ఈ ప్రాంతం గుండా లంకకు వెళ్తున్న శ్రీరాముడు గంధపురిలోని గరుత్మంతుని తల్లి వినతా దేవికి కలియుగంలో భూ నీలసహిత భావనారాయణ స్వామిగా అవతరించి.. ప్రజలను అనుగ్రహించమని కోరినట్లు పురాణం చెబుతోంది. గంధపురి గ్రామం గంజాంగా మారి పెదగంజాం, చినగంజాంగా అభివృద్ధి చెందింది. కాగా.. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన పురాతనమైన భావనారాయణ ఆలయ ముఖమంటపాన్ని ఎనిమిదో శతాబ్దంలో చోళ రాజులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారడం వల్ల ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒకసారి, అక్టోబర్‌లో మరోసారి.. ఇలా సూర్యకిరణాలు ఆలయంలోని దేవుడిని రెండుసార్లు తాకుతాయని ఆలయ పూజారి బృందావనం రాఘవకుమార్ తెలిపారు. సూర్యకిరణాల తాకిడి మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని, ఈసారి కూడా సూర్యనారాయణ స్వామితో పాటు భావనారాయణ స్వామిని ప్రార్థించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారని వారు తెలిపారు.

"పంచ ఆరామ క్షేత్రాలు ఎలా ఉన్నాయో.. ఆ విధంగానే మన రాష్ట్ర వ్యాప్తంగా పంచ భావన క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పెద్దగంజాం గ్రామంగా పిలుస్తున్న ఈ ప్రాంతం పురాణకాలంలో గంధాపురి. జగన్మాత వినతాదేవి ఈ గంధపు వనంలో కూర్చుని తపస్సు చేసింది. అందువల్ల ఆమెకు పుత్ర సంతానం కలిగింది. ఈ విధంగా మరలా అగస్త్య మహామునితో ఆమె మళ్లీ ప్రతిష్ఠించటం వల్ల.. సూర్య కిరణాలు ఇలా పడతున్నాయని ఆర్యులంతా చెప్తున్నారు. వేద ప్రమాణాల ప్రకారం దీనిని ఆపద స్నానం అని అంటారు. ఇలా భావనారాయణ స్వామి పాదాలను మార్చి, అక్టోబర్​లో మాత్రమే తాకే సూర్యకిరణాల దృశ్యాన్ని ఖగోళ శాస్త్రంలో ఒక గొప్ప రహస్యంగా భావించవచ్చు. ఇటువంటి సమయంలో స్వామి వారు అత్యంత శక్తివంతంగా ఉంటారు. ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు అంటున్నారు." -బృందావనం రాఘవకుమార్, ఆలయ పూజారి

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details