Khudiram Bose Movie Special Show : ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. వారందరిదీ ఒక్కో చరిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒకరు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు ఖుదీరామ్ బోస్. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఆ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా.. చాలా మంచి స్పందన వచ్చింది. దాంతో నేడు సాయంత్రం 6 గంటలకు ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. న్యూ దిల్లీ మహదేవ్ రోడ్‌లోని ఫిల్మ్ డివిజన్ ఆడిటోరియంలో ఈ ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఫిల్మ్ డివిజన్ అన్ని ఏర్పాట్లను చేయాలని మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ తరఫున ప్రభుత్వ సెక్రటరీ సురజిత్ ఇందు ఆదేశాలను జారీ చేశారు.