ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగరంగ వైభవంగా.. సింగరకొండ తిరునాళ్లు - సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు

Singarakonda Tirunallu: సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల 68వ వార్షిక తిరునాళ్ల నేటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకిలో జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానుండటంతో.. అధికార్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

singarakonda tirunallu
సింగరకొండ తిరునాళ్లు

By

Published : Mar 5, 2023, 7:47 PM IST

Updated : Mar 5, 2023, 8:04 PM IST

Singarakonda Tirunallu: దక్షిణ భారతదేశంలో అత్యంత మహిమాన్విత పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల తిరునాళ్లకు అద్దంకి ముస్తాబు అయింది. నేటి నుంచి మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే తిరునాళ్ళకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు కొండ కోనలతో ప్రకృతి రమణీయతలతో అలారారుచు పవిత్ర భవనాసి తటాకం ఒడ్డున దక్షిణ ముఖుడై స్వయంభుగా వెలసి ఉన్నారు.

స్థల పురాణం : ఈ దేవస్థానము చరిత్రకు సంబంధించి అనేక కథలు ఉన్నాయి. సుమారు 150 సంవత్సరాల కిందట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో కొండ కింద తేజు సంపన్నుడైన ఒక యోగేశ్వరుడు భవనాసి తటాకం ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహమును ప్రతిష్టించి అదృశ్యమైనట్లు పెద్దలు చెబుతున్నారు.

ఆ అద్భుతాన్ని కొండపై నుంచి చూసిన క్షణము నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దివ్యక్షేత్రముగా విరాజిల్లుతోంది. అక్కడ వెలసిన స్వామివారు.. పిలిస్తే పలికే దైవంగా, భక్తులకు కొంగు బంగారంగా, భక్తుల మనోభిష్టాలు నెరవేరుస్తూ విశేషంగా పూజలు అందుకుంటున్నారు.

ఈ సింగరకొండ క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపతిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటున్నారు. ఉభయ దేవతల క్షేత్రంగా విరాజిల్లుతుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ల ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుతారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఉభయ స్వాములకు 68వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు.

ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు విద్యుత్ ప్రభలతో క్షేత్రం దివ్యాంగ సుందరంగా కనబడుతుంది. చివరి రోజు ఉదయం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు స్వామి వార్ల దర్శన భాగ్యం ఉంటుంది. ఈ ఏడాది నిర్వహిస్తోన్న 68వ వార్షికోత్సవానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

"ఈ సంవత్సరం సింగరకొండ లక్ష్మీనరసింహ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్ల తిరనాళ్ల బ్రహ్మోత్సవములు ఆదివారం నుంచి అనగా 5,6,7 తేదీల్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఫాల్గున శుద్ధ త్రయోదశి ఆదివారం ఉదయం 8.30 గంటలకు ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయానికి నైరుతి మూలలో ఉన్న విఘ్నేశ్వరుని వద్ద గణపతి పూజ, నవగ్రహ, ఆంజనేయ స్వామి పరివార్ల మండపారాధన, అఖండ స్థాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఉష్ణపతాక ఆవిష్కరణ తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం అపరాన్న కాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా విశేషమైన పూజ, నివేదన కార్యక్రమం జరుగుతుంది."
- ఆలయ ప్రధాన పూజారి

"మూడు రోజుల పాటు జరగనున్న ఈ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం ధ్వజారోహణం జరగనుంది. సాయంత్రం పూట గజవాహన సేవ నిర్వహించనున్నారు. మన్య సూత్ర రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు వంటి విశేష పూజా కార్యక్రమాలను సోమవారం ఉదయం నిర్వహించనున్నారు. సాయంత్రం పూట విష్ణువాహన సేవ జరగనుంది. మంగళవారం స్వామివారి దివ్య దర్శన కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం మంగళవారం ఉదయం 5 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు స్వామి వార్ల దర్శనానికి అనుమతి నివ్వనున్నారు."
-టి సుభద్ర ఆలయ సహాయ కమిషనర్

సింగరకొండ తిరునాళ్లు
Last Updated : Mar 5, 2023, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details