మిగ్ జాం తుపాను ప్రభావం - గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు Rains in AP due to Michaung Cyclone:గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని చిరుజల్లులు కురుస్తున్నాయి. తుపాను కారణంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మిగ్ జాం తుపాను ఎదుర్కొనేందుకు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సహాయక చర్యలకు కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దూసుకొస్తున్న మిగ్జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు
నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద పదో నెంబర్ ప్రమాద సూచిక..బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ తీవ్ర తుఫానుగా మారుతున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా (Heavy rains in Bapatla district) యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హెచ్చరించారు. తుపాను ప్రభావంతో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద పదో నెంబర్ ప్రమాద సూచికను అధికారులు ఎగురవేశారు. మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వేటబొట్లన్నీ ఇప్పటికే ఒడ్డుకు చేరాయి. ఒక్కసారిగా బోట్లన్నీ హార్బర్ వద్దకు రావడంతో జెట్టి బోట్లతో కిక్కిరిసింది. సముద్రం కల్లోలంగా మారి 500 మీటర్ల వరకు అలలు ముందుకు వచ్చాయి. దానవాయిపేట, కృపానగరు, వాడరేవు రామాపురం,సూర్యలంక, దిండి, కొత్తపాలెం,లంకేవాని, దెబ్బరాజు కాలువ, మూలగుంట గ్రామాల నుంచి 850కు పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.
తుపాను బాధితులకు అండగా నిలవాలని నేతలకు సీబీఎన్ పిలుపు - సైక్లోన్ ఎఫ్టెక్ట్‌తో యువగళానికి బ్రేక్
14 రక్షిత కేంద్రాలు ఏర్పాటు:ముంపు బాధితులకుపునరావాసం కల్పించి ఆహారం త్రాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రం కల్లోలంగా మారటంతో అధికారులు బీచ్ ను ఖాళీ చేయించి భక్తులను, పర్యాటకులను వెనక్కి పంపించి ఆంక్షలు విధించారు. బాపట్ల సూర్యలంక, వాడరేవు, రామాపురం ఇతర బీచ్‌లలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో 14 రక్షిత కేంద్రాలు ఏర్పాటు చేసామని కలెక్టర్ తెలిపారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమయింది. తుపాను ప్రభావంతో చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చినగంజాం, వాడరేవు సముద్రతీరాల్లో అలలు ఉద్ధృతంగా వస్తున్నాయి. కార్తీక సోమవారం కావటంతో పర్యాటకులు సముద్రస్నానం ఆచరించేందుకు వస్తారని ఈపురుపాలెం ఎస్సై జనార్ధన్ ఆధ్వర్యంలో వాడరేవులో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని సముద్రతీరానికి రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.
విస్తరించిన మిచౌంగ్ తుపాన్ - ఉప్పొంగిన తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది
ప్రత్యేక అధికారిగా కాటమనేని భాస్కర్..ఎం.డి.ఆర్ ఎఫ్ బృందాలు తీర ప్రాంతంలో ఉండేలా జిల్లా అందుబాటులో అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆర్డీవో, తహసిల్దార్ల కార్యాలయాలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 24 గంటలపాటు మండల కేంద్రాల్లో బృందాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తుపాను సంరక్షణ కేంద్రాలను పరిశీలించి సిద్ధం చేయాలన్నారు. నిత్యావసర సరుకులు సిద్ధం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్లకు చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఈ క్రమంలోనే బాపట్లకు కాటమనేని భాస్కర్ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.