President Draupadi Murmu Telangana Tour: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద సందడి మొదలైంది. ఈనెల 28-30 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఖరారైన విషయం తెలిసిందే. ఆమె బస నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలోని పరిసరాలు, భవనాలను ముస్తాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో హోం, రోడ్లు, భవనాలు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, అటవీ, మార్కెటు, విద్యుత్తు తదితర 25 శాఖల సిబ్బందితోపాటు కంటోన్మెంట్ బోర్డు, రక్షణశాఖ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
* హకీంపేట-బొల్లారం చెక్‌పోస్టు- నిలయం మార్గాన్ని, లోతుకుంట మీదుగా ఉండే రాష్ట్రపతి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఆయా మార్గాల్లో వీధిదీపాలతోపాటు, నిలయం పరిసరాల్లో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. నిలయంలో పాములు, కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే చాలా పాములు పట్టుకున్నారు. రెండేళ్ల నుంచి రాష్ట్రపతి పర్యటన లేకపోవడంతో పొదలు పెరిగాయి. వర్షాల వల్ల తోటల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. కోతుల బెడదా అధికంగా ఉంది. ఈ రెండు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సిబ్బంది నిరంతరం ప్రస్తుతం నిలయంలో పనిచేస్తున్నారు.