Police Constable in Bapatla district: అతను శాంతి భద్రతలు కాపాడే పోలీస్, తన తల్లి గ్రామ సర్పంచ్ గ్రామంలో వారి మాటే నడుస్తుంది. గ్రామ ప్రజలు వారికి ఎదురు చెప్పేందుకు సాహసించరు అనకున్నారేమో... వారిని కాదని.. ఎమ్మెల్యే నిర్వహించిన మీటింగ్‌కోసం మహిళా సంఘాల సభ్యులను తీసుకువెళ్లారు వెలుగు యానిమేటర్. దింతో రెచ్చిపోయిన సర్పంచ్ కుమారుడు ఆ యానిమేటర్‌తో గొడవకు దిగి ఆమె భర్తపై దాడి చేసి చెవిని కోసేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
బాపట్ల జిల్లాలో ఓ కానిస్టేబుల్ వ్యక్తిపై దాడి చేసి చెవి కోసిన ఘటన కలకలం రేపింది. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెంకు చెందిన శ్రీనివాసరావుపై కానిస్టేబుల్ మహేష్ దాడికి పాల్పడ్డాడు. మొఖంపై పిడిగుద్దులు గుద్దటంతో పాటు బ్లేడ్ తో దాడి చేయటంతో కుడి చెవి కొంతమేర తెగిపోయింది. కంటి వద్ద కూడా గాయలయ్యాయి. మహేష్ పొన్నూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన తల్లి శివకుమారి సంగుపాలెం సర్పంచిగా ఉన్నారు. శ్రీనివాసరావు భార్య సంకూరి కుమారి అదే గ్రామంలో వెలుగు యానిమేటర్ గా పనిచేస్తున్నారు. ఆసరా పథకం నగదు పంపిణికి సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నిర్వహించిన కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులను సంగుపాలెం నుంచి తీసుకెళ్లింది. అయితే తమకు చెప్పకుండా ఎమ్మెల్యే కార్యక్రమానికి మనుషుల్ని ఎలా తీసుకెళ్తారని సర్పంచి శివకుమారి యానిమేటర్ తో పాటు ఆమె భర్తను ప్రశ్నించారు. అధికారుల సూచన మేరకు తీసుకెళ్లామని చెప్పగా... ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సర్పంచ్ కుమారుడైన మహేష్ జోక్యం చేసుకుని శ్రీనివాసరావుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరూ వైసీపీకి చెందిన వారే కావటంతో పోలీసులు కేసు నమోదుకు వెనుకాడుతున్నట్లు సమాచారం.