SAGAR CANAL : సాగర్ కాలువ ద్వారా బాపట్ల జిల్లా అద్దంకి మండలం మొత్తం మాగాణి, ఆరుతడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. 1968లో తవ్విన సాగర్ కాలువ సుమారు 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగునీటిని అందించింది. 1982 వరకు పుష్కలంగా సాగర్ జలాలు అందటంతో ఈ ప్రాంతం పాడి, పంటలతో కళకళలాడింది. కాలక్రమేణా ఎగువన ఆయకట్టు పెరగటంతో దిగువకు సాగర్ జలాలు అందటం కష్టమైనది. అప్పటి నుంచి కొంత కాలం ఆరుతడి పంటలకు నీరు అందేదీ. గత 10 సంవత్సరాల నుంచి సాగర్ జలాలు పారిన ఉనికి లేకపోయేసరికి ఆ కాలువపై అక్రమార్కుల కన్నుపడింది.
అద్దంకి పట్టణంలోని అభ్యుదయనగర్ నుంచి నామ్ రహదారి, రామ్ నగర్ వరకు అద్దంకి మేజరు సాగర్ కాలువ ఆక్రమణలకు గురైంది. ఆక్రమణలే కాదు కొన్ని చోట్ల పూర్తిగా కనుమరుగైపోయింది. అద్దంకి బ్రాంచి కాలువ 33/2 మైలురాయి బల్లికురవ మండలంలోని వల్లాపల్లి వద్ద నుంచి అద్దంకి మేజరు కాలువగా విడిపోయి 23.766 కిలో మీటర్ల పొడవునా సాగర్ కాలువగా ఏర్పాటు అయ్యింది.
కాలువ కింద 10వేల 674 ఎకరాల ఆయకట్టు ఉంది. మండలంలోని ధర్మవరం వద్ద మొదలుకొని వెలమూరి పాడు వద్ద గల గుండ్లకమ్మ నదిలో కలసి పోయేటట్లుగా సాగర్ కాలువను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 15వ కిలోమీటర్ వరకు సాగరు జలాలు అందుతున్నాయి. మిగిలిన 8 కిలోమీటర్లలో అక్కడక్కడా ఆక్రమణలకు గురైంది. కొన్ని చోట్ల పూర్తిగా కనుమరుగైంది.
సాగర్ కాలువపై సంబంధిత అధికారుల పర్యవేక్షణా లోపం వల్లనే ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. సాగర్ కాలువ 19వ కిలోమీటరు నుంచి 21వ కిలో మీటరు వరకు పూర్తిగా కనుమరుగైపోయింది. మేజరు కాలువకు అనుసంధానంగా పంట కాలువలు ఉన్నాయి. అయితే ఆ పంట కాలువలు పూర్తిగా చదును చేసి ప్లాట్లుగా మారాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
19వ కిలో మీటరు నుంచి 23వ కిలోమీటరు వరకు సాగర్ కాలువ అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఉంటుంది. కాలువలో నీరు ప్రవహించకపోయేసరికి కొంత మంది కాలువను నివేశనా స్థలాలుగా మార్చుకొని గృహాలు నిర్మించుకున్నారు. మేజరు కాలువ కింద ఉన్న పంట కాలువలను పూర్తిగా చదును చేసి ఫ్లాట్లలో కలిపేసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ, పురపాలక సంఘం, నీటిపారుదల శాఖల సమన్వయ లోపం కారణంగానే సాగర్ కాలువ ఆక్రమణకు గురవడానికి ముఖ్య కారణంగా కనిపిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులు ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చే అర్హత లేదంటూ కొన్ని జీవోలను చూపిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. పురపాలక సంఘం వారు మాకు అసలు హక్కే లేదంటూ వారి వద్ద ఉన్న జీవోలను చూపిస్తున్నారు. ఇక రెవెన్యూ శాఖ మాత్రంపై రెండు శాఖలు ఏ చర్యలు తీసుకున్నా వారికి అండగా ఉంటామే తప్ప తాము చేసేది ఏమి లేదంటూ ఎవరికి వాళ్లే చేతులు దులిపేసుకుంటున్నారు. పై కారాణాలను అదునుగా చేసుకొని ఆక్రమణదారులు నాగార్జున సాగర్ కాలువను అద్దంకి పట్టణ పరిధిలో పూర్తిగా కనుమరుగు చేశారు.
ఇవీ చదవండి: