Panchayat Workers Strike for Salaries: పంచాయతీ కార్మికుల ఆవేదన - మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ సమ్మె Panchayat Workers Strike for Salaries: జీతాల కోసం కళ్లు కాయలు కాసేలా పారిశుద్ధ్య కార్మికులు ఎదురుచూస్తున్నారు. దీపావళి పండగ సంతోషంగా జరుపుకోవాల్సిన వారంతా జీతాలు కోసం ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు రాక నానా అవస్థలు పడుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనాడూ తమకు సకాలంలో జీతాలు చెల్లించలేనది వాపోయారు.
మూడు నెలలుగా జీతాలు చెల్లించకుండా: జీతం రావాలంటేనే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని బాపట్ల జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు అంటున్నారు. ప్రతి సారి సమ్మెలు చేస్తేనే జీతాలు వేస్తున్నారని చెప్తున్నారు. ఈ సారి కూడా మూడు నెలలుగా జీతం వెయ్యకుండా పెండింగ్లో పెట్టారని.. తమ సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపటం లేదని ఆవేదన చెందుతున్నారు.
Sanitation Workers Facing Salary Problems: పారిశుద్ధ్య కార్మికులతో జగన్ జీతాలాట..! నాలుగేళ్లుగా నానావస్థలు..
భారీగా పేరుకుపోయిన చెత్త: గత మూడు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో బాపట్ల జిల్లా ఇంకొల్లులో పంచాయతీ కార్మికులు దీక్ష చేపట్టారు. వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడంతో.. ఇంకొల్లులో చెత్త ఎక్కడికక్కడే భారీగా నిలిచిపోయి రోడ్లలో దుర్వాసన వెదజల్లుతుంది. కార్మికులు విధులు బహిష్కరించి వారం రోజులుగా నిరసన చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవని.. తమ సమస్య పరిష్కారానికి చోరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు కోసం రోడ్డెక్కాల్సిందేనా: జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జీతాలివ్వాలని పారిశుద్ధ్య కార్మికులు వేడుకుంటున్నారు. అయితే గతంలోనూ పలుమార్లు జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
Sanitation Workers Problems: అరకొర వేతనాలు.. పట్టించుకోని సర్కార్.. దుర్భరంగా పారిశుద్ధ్య కార్మికుల జీవితం
చర్చలు విఫలం: ఇక ఇప్పుడు కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాల్సి ఉండగా మూడు నెలలుగా చెల్లించటం లేదు. వేతనాలతో పాటు విధుల్లో భాగంగా ఇవ్వాల్సిన సబ్బులు, పాదరక్షలు, కొబ్బరి నూనెలు సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు చెప్తున్నారు. అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపటం లేదని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఈవోఆర్డీ శ్రీనివాసరావు కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతానికి ఒక నెల జీతం ఇస్తామంటున్నారని.. మూడు నెలల వేతనం ఒకే సారి ఇవ్వాలని కోరుతున్నామని కార్మికులు తెలిపారు.
వేడుకుంటున్న కార్మికులు: దీంతో దీపావళి పండగ సందర్భంగా శనివారం వేరే గ్రామాల నుంచి కార్మికులను తీసుకువచ్చి వీధులు శుభ్రం చేయించాలని పంచాయతీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆ ప్రయత్నాలను అడ్డుకుంటామని కార్మికులు హెచ్చరించారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవటంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వం.. స్పందించి తమకు జీతాలివ్వాలని ఇంకొల్లు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు వేడుకొంటున్నారు.
Municipal Workers Agitation: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు.. సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనలు