Jagananna Houses Condition: బాపట్ల జిల్లాలో బొమ్మనంపాడు వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీలో సుమారు 650 నుంచి 700 వరకు లబ్ధిదారులున్నారు. నిర్మాణాలు మాత్రం అరకొరగానే జరుగుతున్నాయి. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని చెబుతున్నారు. కానీ వసతులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. రవాణా సౌకర్యం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతర రహదారులు కూడా సక్రమంగా లేవు. ఒక్కో ఇల్లు పునాదులు దగ్గరే కుంగిపోయి పాడైన పరిస్థితులు కనపడుతున్నాయి.
అద్దంకి అర్బన్ పరిధిలో మూడు చోట్ల జగనన్న లేఅవుట్లను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం జగనన్న గృహ సందర్శన కార్యక్రమంలో భాగంగా అద్దంకి అర్బన్ పరిధిలో బొమ్మనంపాడు గ్రామానికి దగ్గరలో నిర్మిస్తున్న లేఅవుట్‌ను తహసీల్దార్ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే మీకు రావాల్సిన బిల్లులు కూడా సకాలంలో అందుతాయని తెలిపారు. ఒక్కోచోట సుమారు 1000కి పైగా ఇళ్లను నిర్మిస్తున్నట్లు మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి తెలిపారు.
కాంట్రాక్టర్ చేతిలో: ఓ కాంట్రాక్టర్‌కి సుమారు 49 ఇళ్ల వరకు నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారు. కానీ సదరు కాంట్రాక్టర్ మాత్రం ఇప్పటివరకు 23 ఇళ్లకు మాత్రమే పునాదులు వేశాడు. కాంట్రాక్టరుకు 49 ఇళ్ల మీద సుమారు కోటి రూపాయల పైన బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు.. కాంట్రాక్టర్ ఏం చేస్తున్నట్లు అని అధికారులు.. కింది స్థాయి సిబ్బందిపై చిర్రుబుర్రులాడుతున్నారు. ఉగాది నాటికి జగనన్న ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తారో లేదో అనే సందేహంగా ఉందని స్థానికులు అంటున్నారు.