National Level Kala Parishad Drama Competitions : జాతీయ స్థాయి కళాపరిషత్ నాటికల పోటీలు బాపట్ల జిల్లా మార్టూరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీకారం, రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో 13వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు అట్టహాసంగా మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసారు. ఈ నాటిక పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీకారం, రోటరీ కళా పరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీల్లో ప్రదర్శించిన కళా దీపికలు ఆలోచింపచేసాయి. మార్టూరులో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలతో వీక్షకులను కట్టిపడేశారు.
కొత్త పరిమళం.. యుద్ధ భయం :తొలి రోజు శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం బొరి వంక వారి "కొత్త పరిమళం" నాటిక యుద్ధ భయంతో ప్రజలు క్షణ క్షణం ఒణుకుతూ, నరకయాతన పడుతూ సాగిస్తున్న జీవనాన్ని కళ్ల ముందు ఉంచింది. సైనికులు కుటుంబానికి దూరంగా దేశ రక్షణకు దగ్గరగా ఉండటం వల్ల మనం భయం లేకుండా జీవితాన్ని గడుపుతున్నామని తెలియజేశారు.
ప్రేమతో నాన్న.. మధ్య తరగతి కుటుంబాలు : అనంతరం శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరివారి "ప్రేమతో నాన్న" నాటిక ద్వితీయ ప్రదర్శనగా సాగగా, విశ్రాంత సగటు మనిషి తన అల్లుడు వ్యాపారంలో నష్టపోయిన తీరు, కూతుర్ని దూషణలతో వేధిస్తున్న అంశాలతో మధ్య తరగతి కుటుంబాల్లో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. ఈ నాటికతో తమ వ్యక్తిగత జీవతాలను గుర్తు చేసుకున్నారు.