Lokesh fires on YSRCP: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో విషాదం నెలకొంది. గంట వ్యవధిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రేపల్లె శివారు ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సరకు తెచ్చుకొని తాగిన తర్వాతే వృద్ధులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఒకరి పెద్దఖర్మకు హాజరైన 8మంది మద్యం తాగారు. భోజనం చేసి ఇంటికెళ్లిన కొద్దిసేపటికి వారిలో ఐదుగురికి వాంతులై అస్వస్థతకు గురయ్యారు. గరికపాటి నాంచారయ్య, రేపల్లె రత్తయ్య అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. గుంటూరు ఆసుపత్రిలో చేర్చారు.
ఈ ఘటనపై స్పందించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ప్రభుత్వం అమ్ముతోన్న విషమద్యం తాగి ఇద్దరు బలయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నిరుపేదలు, కూలీలు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బునీ మద్యం పేరుతో లాగేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. జే బ్రాండ్ విషమద్యంతో ఇంకెందరిని బలి తీసుకుంటారని ప్రశ్నించారు. మద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.