Munugode By poll Voting: మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ జోరందుకుంది. నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వికలాంగులు, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన వారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపా నేతలు పోలింగ్ సరళిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతంగా నమోదైన పోలింగ్.. 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3 గంటల వరకు పోలింగ్ 60 శాతానికి చేరిందని ఈసీ తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 77 శాతానికి చేరుకుంది. 6 గంటల వరకు క్యూలైన్లో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశమిస్తామని అధికారులు తెలిపారు.
Munugode By Election Polling : పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పోలింగ్ కేంద్రాలకు తమంతట తాము రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ.. సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. చౌటుప్పల్ పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్ సందర్శించారు.