Man Try To Suicide By Cutting His Neck : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలోని రైల్వేస్టేషన్ సమీపంలో వెంకట్(21) అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. స్థానికులు గమనించి చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకటేష్, మరో వ్యక్తి గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సర్దిచెప్పి ఇద్దరిని మందలించారు. దీంతో కోపంతో వెంకటేష్ రోడ్డుపైనే బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
రాజంపేటలో బాలుడిపై కుక్కల దాడి :అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని నలంద స్కూల్ వద్ద మంగళవారం ధనుష్ (7) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని ప్రథమ చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. బాధిత బాలుడు పాఠశాల భోజన విరామ సమయంలో బయటకు రాగా కుక్కలు దాడి చేసి కరవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ధనుష్ తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లగా, బాబాయ్ సంరక్షణలో ఉన్నాడు. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు అధికమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు చదువుకునే ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.