Kotappakonda prabhalu 2023 : పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పండుగ పర్వదినాన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంతాల నుంచి తరలివచ్చిన 22 విద్యుత్ ప్రబల వెలుగు జిలుగులు కొండ పరిసర ప్రాంతాలను దేదీప్య మానం చేశాయి. ప్రభల వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కోటప్పకొండకు నలువైపులా రహదారులు కిక్కిరిసాయి. పలు రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. లింగోద్భవ పూజల అనంతరం స్వామివారికి అభిషేకాలు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని దర్శనం చేసుకొని, ప్రభలను సందర్శించారు.
ఆకట్టుకుంటున్న విద్యుత్ ప్రభ:మేడి కొందురు మండలం పేరేచర్లలో గల గంగా పార్వతి సమేత కైలాస నాదేశ్వరుడు (కైలా సాగిరి క్షేత్రం) లో మహా శివరాత్రి వేడుకలు భక్రి శ్రద్దలతో వైభవంగా జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన 40 అడుగుల విద్యుత్ ప్రభ అందరినీ ఆకట్టుకుంది. ప్రభపై పాట కచేరీ ఏర్పాటు చేశారు. తిలకించేందుకు ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
2 కోట్లతో అభివృద్ధికి కృషి:మహాశివరాత్రి సంధర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామినీ రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యరాయణ దంపతులు శనివారం దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కోటప్పకొండ తిరునాళ్ల వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తిరునాళ్ల వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు 2 కోట్లతో కోటప్పకొండ అభివద్ది కార్యక్రమాలను త్వరలో ప్రారంభించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు: మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం తరపున నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ శివశంకర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వెండిప్రభకు పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను మేళతాళాలతో ఆనందవల్లి ఆలయానికి తీసుకువెళ్లి తదుపరి త్రికోటేశ్వరస్వామికి సమర్పించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ జేసీ శ్యాం ప్రసాద్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు.. ఇవీ చదవండి