Internal Differences Between YCP Leaders: ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు (CM Jagan Birthday Celebrations) వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరుకు ఆజ్యం పోశాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు నేపథ్యంలో ఎవరికి వారు తమ బలం చూపించుకునేందుకు పోటీపడ్డారు. పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే గాక, ప్రత్యర్థుల ఫ్లెక్సీలు తొలగించడం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీలో అలజడి రేగింది.
Differences between YCP Leaders in Alur constituency: కర్నూలు జిల్లా ఆలూరులో అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం, ఆస్పరి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల మార్పుపై అధినేత దృష్టి సారించిన నేపథ్యంలో గుమ్మనూరుకు ఈసారి టికెట్ లేదని, విరూపాక్షిని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించినట్లు ప్రచారం సాగుతోంది.
'కేకును నేలకేసి కొట్టి' మంత్రి Vs జడ్పీటీసీ - సీఎం జగన్ పుట్టిన రోజున భగ్గుమన్న వర్గ విభేదాలు
దీంతో అధినేత వద్ద తమ బలం చూపించుకునేందుకు ఇరువర్గాలు పోటీపడ్డాయి. ఆస్పరిలో కేక్ కట్ చేసేందుకు మంత్రి కుమారుడు ఈశ్వర్, సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి వచ్చారు. దీంతో అక్కడే ఉన్న విరూపాక్షి ఫ్లెక్సీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అనుచరులు ఆ ఫ్లెక్సీలను చించేశారు. ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న విలేకరిపైనా దాడికి పాల్పడ్డారు. జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు కేక్ తీసుకుని వెళ్తున్న చిప్పగిరి సర్పంచ్ వెంకటేశ్‌ను అడ్డుకుని మంత్రి అనుచరులు దాడికి యత్నించారు. కేక్‌ను నేలకేసి కొట్టారు. దీనిపై విరూపాక్షి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.