House is Being Moved Back: ఓ ఇల్లు స్థాన చలనం జరుగుతుందంటే నమ్ముతారా.. అది కూడా ఒక అడుగు కాదు రెండడుగులు కాదు.. ఏకంగా 25 అడుగులు వెనకకు జరపాలనుకున్నారు. రోడ్డు విస్తరణకు ఇల్లు అడ్డుగా ఉందని తొలగించాల్సిందిగా బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామంలోని ఓ కుటుంబానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూల్చడానికి ఆ ఇంటి యజమానికి మనసు ఒప్పుకోలేదు. తన కుమారులతో కలసి అంతర్జాలంలో శోధించి పరిష్కార మార్గాన్ని అన్వేషించారు. ఇంటిని రోడ్డు నుంచి 25 అడుగులు వెనకకు జరిపే విధంగా 10లక్షలకు జేజే బిల్డింగ్ షిఫ్టింగ్ వర్క్ వారితో ఒప్పందం చేసుకున్నారు. దీంతో పాటు మరో 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని యజమాని ఖాదర్ బాబు తెలిపారు. పని మొదలు పెట్టిన రోజు నుంచి కూడా ఇది సాధ్యపడుతుందా అని సందేహం ఉండేదని.. కానీ వారు చేస్తున్న పని చూశాక నమ్మకం కుదిరిందని ఖాదర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.
"మేము 5 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాం. కానీ ప్రస్తుతం 25 అడుగులు వెనక్కి జరపాలి. దీంతో మేము వేరే కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. దీనికి మొత్తం 10 లక్షలు కంపెనీకి ఇస్తున్నాం.. మరో 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంటికి ఎటువంటి నష్టం జరిగినా కంపెనీ వారే భరిస్తారు". - ఖాదర్ బాబు, ఇంటి యజమాని