Hanuman Jayanti Celebrations 2023 : విజయవాడలో హనుమాన్ శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. విశ్వహిందూ పరిషత్తు, బంజరంగ్దళ్ సంయుక్త ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోని రామకోటి నుంచి సత్యనారాయణపురం వరకు ఈ యాత్ర సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి, విజయవాడలోని హనుమద్దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామి తదితరులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జైశ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో మారు మోగించారు. కాషాయ పతాకాలను చేతపట్టుకుని ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమత్ జయంతిని పురస్కరించుకుని అనేక చోట్ల శోభాయాత్ర నిర్వహించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ధైర్యం, భక్తి, బలానికి, విధేయతకు, నమ్మకానికి, నిస్వార్ధతకు, చురుకుదనానికి, తెలివి వంటి గొప్పగుణాలకు ఆంజనేయుడు ప్రతీక అని అన్నారు.
హనుమాన్ శోభయాత్ర:ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీను నిర్వహించారు. మండలంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయమైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్ర జంగారెడ్డిగూడెం పట్టణ పురవీధుల మీదుగా సాగింది. శోభ యాత్రలో ద్విచక్ర వాహనాలపై వందలాది హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. పట్టణ పురవీధుల్లో హనుమాన్ నామస్మరణతో మారు మోగాయి. హిందూ ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, నేటి యువతకు హిందూధర్మం విశిష్టత తెలియ చెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని విశ్వవిందు పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ రవి తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణ : నూజివీడు పట్టణంలో హనుమాన్ భక్తులు జెండా చేత పట్టి బైక్ ర్యాలీ నిర్వహించారు. జై హనుమాన్ జై జై హనుమాన్ నినాదాలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఐక్యంగా ముందడుగు వేయాలన్నారు. కుల మతాలకు అతీతంగా సంఘటిత శక్తిగా ప్రపంచ పటంలో నిలవాలని పిలుపునిచ్చారు.
జాతీయ రహదారిపై యాత్ర :కృష్ణా జిల్లా గన్నవరంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. పట్టణంలోని చెన్నై-కోల్కతా జాతీయ రహదారి మీదుగా సాగిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు : తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలను టీటీడీ వేడుకగా నిర్వహించింది. ముందుగా హనుమంతుడు జన్మస్థలంగా ప్రకటించిన ఆకాశగంగ అంజనాద్రిలో ఉదయం 8:30 గంటలకు బాలంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. జపాలి తీర్థంలోని హనుమంతుడికి అభిషేకాలు, నివేదనలు నిర్వహించారు. జాపాలిలోని హనుమంతుడికి టీటీడీ తరుపున జేఈఓ వీర బ్రహ్మం పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటి ఘాటు రోడ్డులోని ఏడోవ మైలు వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పూజాలు,నివేదనలు సమర్పించారు. తిరుమలలో ఈ నెల 18 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలను ఘానంగా నిర్వహించనుంది..