Flexi fight between students and leaders:బాపట్ల జిల్లాలో ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 9న బాపట్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బస చేశారు. టీడీపీ మద్దతుదారులైన కొందరు విద్యార్థులు చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్లెక్సీని కళాశాల సమీపంలోని 216 జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. కొందరు వైసీపీ నాయకులు ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి కారు, బైక్‌ల్లో వచ్చి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్లెక్సీని చించేసి ప్రేము ఎత్తుకుపోయారు. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు బుధవారం ఉదయం వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించి వేశారు.
సీఎం జగన్ జన్మదిన వేడుకలు:తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీ చింపారని బాపట్ల గ్రామీణ పోలీసులకు వైసీపీ నాయకులు విద్యార్ధులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ, డిజేలతో హోరెత్తించి కళాశాల గేటును తోసుకుని వైసీపీ శ్రేణులు లోపలికు వెళ్లారు. అతికష్టం మీద పోలీసులు వారిని ఆపగలిగారు. ఆ సమయంలో కళాశాల తరగతులు ముగించుకొని బయటకు వస్తున్న జమ్ములపాలెంకు చెందిన పువ్వాడ గిరీష్ చంద్ర అనే విద్యార్థిని వైసీపీ నాయకులు కాలర్ పట్టుకుని లాకెళ్లారని విద్యార్థి ఆరోపిస్తునారు. అలాగే తన మెడలో వైకాపా జెండా వేసి జై జగన్ అని చెప్పాలని వీడియోతీస్తూ... తనను బలవంత పెట్టారని దీనికి విద్యార్థి నిరాకరించినట్లు ఆ విద్యార్థి తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల తెలుగు యువత పార్టీ మారారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారని గిరీష్ చంద్ర ఆరోపిస్తున్నాడు.