Road Accident in Bapatla District: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో అద్దంకి ఎస్సైగా పనిచేస్తున్న సమందరవలి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, డ్రైవర్‌తో సహా అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద శ్రీ బ్రమరా టౌన్ షిప్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్సై కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు జిల్లాలోని చినగంజాం నుంచి అద్దంకి వస్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది.
అద్దంకి వైపు వెళ్తున్న కారు డివైడర్‌పై నుంచి ఒంగోలు వెళ్లే మార్గం వైపుకు వచ్చింది. దీంతో అదే సమయంలో రహదారిపై ఒంగోలు వైపు వెళ్తున్న లారీ.. కారుపైకి ఎక్కటంతో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ కారణంగానే కారులో ప్రయాణిస్తున్న ఎస్సై భార్య, కుమార్తె, వారి బంధువులు, డ్రైవర్‌తో సహా అయిదుగురు దుర్మరణం పాలయ్యారు.
Road Accident in Eluru District: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కురెళ్లగూడెం గ్రామానికి చెందిన దండ్రు వీరస్వామి, కర్నాటి మహేంద్ర, ఊటుకూరు ఫణీంద్ర, గండికోట శ్రీనులు.. ఉంగుటూరు మండలం కైకరం నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై స్వగ్రామం బయలుదేరారు.
పూళ్ల వద్ద రహదారి పక్కగా ద్విచక్ర వాహనాలు నిలిపారు. ఈ క్రమంలో భీమవరం నుంచి చింతలపూడి వెళ్లే.. ఆర్టీసీ బస్సు రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. తరువాత సుమారు 100 మీటర్లు మేర ఈడ్చుకువెళ్లింది. ఈ ప్రమాదంలో వీరస్వామి, మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా ఫణీంద్రని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
గండికోట శ్రీను పరిస్థితి కూడా విషమంగా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు రెండు గంటల తర్వాత.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.