Temperature in Telangana : రాత్రిళ్లు చలి.. సూర్యుడు వచ్చిండంటే కాక.. తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజులుగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో చలి వాతావరణం కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో నాలుగు జిల్లాలు మినహా మిగిలిన అన్నిచోట్లా 15 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇంకోవైపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Temperature change in Telangana : మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 22 తరువాత ఎండలు మొదలు కానున్నాయి. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా ఉంటుండగా.. మిగిలిన చోట్ల సాధారణానికి సమీపంలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో ఈ నెల మూడో వారం నుంచి వేసవి కాలం ఎండలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్త శ్రావణి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు వివరించారు. మరో రెండు రోజులు శీతల వాతావరణం కొనసాగుతుందన్నారు.