Organic Farming: బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం చందలూరుకు చెందిన సూదనగుంట నరేంద్రబాబు ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన భార్య అనంతలక్ష్మి డిగ్రీ చదివారు.. 15 ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రం ఉండటంతో ఉద్యోగం చేయడంలో ఆసక్తి చూపకుండా వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆదర్శ భావాలు కలిగిన నరేంద్రబాబు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్, రైతు నేస్తం నిర్వహించే సదస్సులకు హాజరయ్యేవారు. ప్రకృతి సేద్యంపై ఆసక్తి పెంచుకున్నారు. 2015 నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిపెట్టాడు.. తొలి మూడేళ్లు ఆశించిన ఫలితాలు రాలేదు.
12 లక్షల పెట్టుబడితో 30 లక్షల ఆదాయం..నాలుగో సంవత్సరం నుంచి ఈ దంపతులు చేస్తున్న కృషిని తితిదే వారు గుర్తించారు. రైతు పండించిన శనగల్ని పూర్తిగా కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బహిరంగ మార్కెట్ కంటే 20 శాతం అదనపు ధర చెల్లించారు. దీంతో సొంతంగా చేసే 15 ఎకరాలతో పాటు అదనంగా మరో 35 ఎకరాలను కౌలు తీసుకొని మొత్తం 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరా కౌలు గరిష్టంగా రూ.17 వేలు పలుకుతోంది. మొత్తంగా గత ఏడాది పెట్టుబడి రూ.12 లక్షలు కాగా రూ.30 లక్షల వరకు ఆర్జించారు. ఈ రైతు పొలంలో పండించే ఎలాంటి పంట అయినా కొనుగోలుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తితిదే వారు ప్రకటించారని రైతు పేర్కొంటున్నారు.
ప్రకృతి వ్యవసాయం తానొక్కడినే చేయడం కాదు. పదిమంది రైతుల్ని ఆ దిశగా నడిపించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.. కేవలం చందలూరులోనే కాకుండా అనంతపురం, మహబూబ్నగర్, జమ్మలమడక, రాప్తాడు వంటి ప్రాంతాల నుంచి రైతులు నరేంద్రబాబుతో మాట్లాడుతున్నారు. పొలంలో ఘన జీవామృతం, అగ్నిఅస్త్రం, దశపన్ని కషాయం, గోకృపామృతం, వేపగింజల కషాయం, మట్టి(సీవీఆర్ విధానం) ఉపయోగిస్తారు. ప్రకృతి సేధ్యంతో పాటు, అనుబంధంగా సహజసిద్దంగా సబ్బులు, సాంబ్రాణి(ధూప్స్టిక్స్) పిడకలు, గిన్నెల సబ్బు వంటివి తయారు చేస్తారు.