ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధిష్ఠానం హామీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలిక తెర

TELANGANA CONGRESS ISSUE: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. అసంతృప్త నేతలతో స్వయంగా మాట్లాడిన ఏఐసీసీ నాయకత్వం.. సమస్యను జఠిలం చేయొద్దని సూచించింది. సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందామని జాతీయ నేతలు తెలిపారు. దీంతో నేడు జరగాల్సిన సమావేశాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్లు రద్దు చేసుకున్నారు.

Telangana Congress
తెలంగాణ కాంగ్రెస్‌

By

Published : Dec 20, 2022, 7:15 PM IST

TELANGANA CONGRESS ISSUE: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో కమిటీల ప్రకటనతో రేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. వలసవాదులకు పదవులు దక్కాయని.. జెండా మోసిన వాళ్లకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల సమావేశమైన అసంతృప్తుల వర్గం.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వరెడ్డి నివాసంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొన్న వేళ.. అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు.. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, దిగ్విజయ్‌సింగ్ స్వయంగా అసంతృప్త నేతలతో మాట్లాడారు.

మహేశ్వర్‌రెడ్డి నివాసంలో సాయంత్రం అసంతృప్తనేతల భేటీకి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలోనే దిగ్విజయ్‌సింగ్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. తాజా పరిణామాలను ఆరా తీసిన దిగ్విజయ్‌.. త్వరలోనే హైదరాబాద్‌ వస్తామని, ఏమైనా సమస్యలుంటే చర్చిద్దామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని రద్దు చేయాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్‌ చేశారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి సీనియర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చిన ఖర్గే.. సమావేశం రద్దు విషయాన్ని తక్షణమే అందరికీ చేరవేయాలని సూచించారు. మరోవైపు వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి.. సమావేశాలను వాయిదా వేసుకోవాలని, సమస్యలు ఉంటే కూర్చొని చర్చిద్దామని స్పష్టం చేశారు. దీంతో ఇవాళ జరగాల్సిన సీనియర్ల సమావేశం రద్దయింది.

మేమెప్పుడూ అలా చెప్పలేదు..: కాంగ్రెస్‌ పార్టీలో తెదేపా నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని తామెప్పుడూ చెప్పలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 13 మందిని రాజీనామా చేయమని తాము అడగలేదన్న ఆయన.. తెదేపా నుంచి వచ్చిన వారంతా తమ వారేనని.. వారు వివిధ హోదాల్లో పని చేసి కాంగ్రెస్‌లోకి వచ్చారని భట్టి తెలిపారు. పార్టీలో ఉన్న కొందరు సీనియర్లకు కూడా కమిటీల్లో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. అధిష్ఠానం స్పందించిన తీరును స్వాగతిస్తున్నట్లు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఏఐసీసీ పరిష్కరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏకతాటిపైకి వస్తారా..: పార్టీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగినప్పటికీ.. మున్ముందు నేతలంతా కలిసి సాగే విషయంపై సందేహం నెలకొంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు కమిటీల ప్రకటన వేళ రెండుగా చీలిపోగా.. అధిష్ఠానం జోక్యంతో ఏకతాటిపైకి వస్తారా అన్న అంశం చర్చనీయంగా మారింది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details