VRAs face-based attendance issues: గ్రామ రెవెన్యూ సహాయకులకు ముఖ ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) యాప్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేడు ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం అందజేసింది. ఈ మేరకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సీసీఎల్ఏను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏలకు ముఖ ఆధారిత హాజరును వర్తింప చేయటం సరికాదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అనంతరం ఏపీఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలన్న ఆదేశాలతో వీఆర్ఏల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని ఉద్యోగుల సంఘం ఆక్షేపించింది. వీఆర్ఏలంతా పార్ట్ టైమ్ వృత్తిగా పనిచేసే ఉద్యోగులు మాత్రమేనని.. ప్రభుత్వం వారికి గౌరవ వేతనం మాత్రమే ఇస్తోందని స్పష్టం చేసింది. అతి తక్కువ వేతనం వచ్చే వీఆర్ఏలకు సెల్ ఫోన్లు కొనుగోలు చేసుకునే స్థోమత కూడా లేదని పేర్కొంది. వీఆర్ఏల్లో కొందరు నిరక్షరాస్యులు కూడా ఉన్నారని, వీరికి స్మార్ట్ ఫోన్ వాడకమే తెలియదని వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ వాడకమే తెలియని.. వీఆర్ఏలను ముఖ ఆధారిత హాజరు నుంచి ప్రభుత్వం మినహాయించాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
మరోవైపు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని మినహాయించాలని, ఇతర అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 14న కలెక్టరేట్ల వద్ద మహా ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)ల సంఘం వెల్లడించింది. వయసు రీత్యా వీఆర్‌ఏలు ముఖ ఆధారిత హాజరుకు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలకు రాలేరని తెలిపింది. చాలామందికి సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదని పేర్కొంది.