CM JAGAN DISTRIBUTED TABS : కేవలం చదువు అనే ఆస్తితోనే పిల్లల తలరాతలు మారతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ఆయన ప్రారంభించారు. బతుకులు మారాలంటే తలరాతలు మారాలన్నారు. ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్న సీఎం.. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలని పేర్కొన్నారు. చదువుకు కులం, ఆర్థిక ఇబ్బందులు ఆటంకం కారాదన్నారు. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ చదువులు:ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ చదువులు అందుబాటులోకి తెచ్చామన్న సీఎం.. 4,59,564 మంది విద్యార్ధులు, 59,176 మంది ఉపాధ్యాయులకు వాటిని అందజేస్తున్నట్లు తెలిపారు. 2024లో సీబీఎస్ఈ పరీక్షలకు సిద్ధమయ్యేలా ట్యాబ్‌లు ఉపయోగపడతాయన్నారు. ఇకపై ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తామని వెల్లడించారు. ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ పొందుపరచి అందిస్తున్నామని.. బడిలో చెప్పిన పాఠాలు ఇంటికెళ్లి ట్యాబ్ ద్వారా మళ్లీ చదువుకోవచ్చని తెలిపారు. రూ.1400 కోట్లు విలువ చేసే ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరో తరగతి, ఆపై తరగతి పిల్లలకు ఇకనుంచి డిజిటల్ తరగతి గదులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మళ్లీ పాఠశాలలు తెరిచేసరికి డిజిటల్ తరగతి గదులు రాబోతున్నాయని పేర్కొన్నారు.