CM jagan distributed tabs in AP: నాడు-నేడు కార్యక్రమం పూర్తయిన ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆరో తరగతి ఆపైన తరగతి గదులన్నింటిలో..డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. బాపట్ల జిల్లా యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ పథకం ప్రారంభించిన సీఎం, పేద విద్యార్థుల తలరాతలు మారనున్నాయని తెలిపారు. ఇకపై ప్రతి ఏడాది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 8 వతరగతి విద్యార్థులకు.. బైజూస్ పాఠాలతో కూడిన ట్యాబ్‌లను ముఖ్యమంత్రి జగన్ అందజేశారు. బాపట్ల జిల్లా యడ్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు సీఎం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. విద్యతోనే సామాజిక అంతరాలు తొలగిపోతాయని సీఎం జగన్ అన్నారు. నాణ్యమైన చదువులతో పేద విద్యార్థుల తలరాతలు మారుతాయని చెప్పారు. అందుకే విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ.. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకే బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు అందజేస్తున్నామని.. ఇకపై ప్రతి ఏడాది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని సీఎం ప్రకటించారు.
'తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మూడున్నరేళ్ల కాలంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగానే అమ్మఒడి, జగనన్న కాను, విద్యాదీవెన, వసతి దీవెన, నాడునేడు వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేపట్టడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో బోధన, సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక అమలు చేయటం ద్వారా మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం. ఇదే క్రమంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తం 5లక్షల18వేల ట్యాబ్‌లు అందజేస్తున్నాం. దీనికోసం 688కోట్లను ఖర్చు చేశాం. అలాగే బైజూస్ కంటెంట్ కోసం మరో 778 కోట్లు ఖర్చుచేశాం. 2024లో పదవతరగతిలో సీబిఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసేలా ఈ ట్యాబ్‌లు ఉపయోగపడతాయి.'- సీఎం జగన్
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, టీచర్లకు మొత్తం 5లక్షల18వేల ట్యాబ్‌లు అందచేస్తున్నట్లు వివరించారు. దీనికోసం 688కోట్లు, అలాగే బైజూస్ కంటెంట్ కోసం మరో 778 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. 2024లో పదవతరగతిలో సీబిఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసేలా ఈ ట్యాబ్‌లు ఉపయోగపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ట్యాబ్ లకు మూడేళ్ల వారెంటీ ఉందన్నారు. సమస్య వస్తే వారం రోజుల్లో రిపేర్ చేస్తారని.. లేకపోతే కొత్త ట్యాబ్ అందజేస్తారని వివరించారు. పిల్లలు చెడిపోయేందుకు అవకాశం ఉన్న కంటెంట్ ఈ ట్యాబ్‌లలో రాకుండా నియంత్రించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సీఎం పుట్టినరోజు కావటంతో సభావేదికపై జగన్ కేక్ కట్ చేశారు.
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన సీఎం జగన్ ఇవీ చదవండి: