Amarnath Murder Case : అధికార పార్టీ అండతోనే రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బాపట్ల జిల్లా ఉప్పాల వారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. లక్ష రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఇటువంటి దారుణ ఘటనలు ఎక్కడ పునరావృతం కాకూడదనీ సోము వీర్రాజు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చెయ్యాలని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉండటం సరికాదన్నారు. ప్రజలను రక్షించాల్సిన అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని పేట్రేగి పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ కేసులో పోలీసులు నిర్భయంగా వ్యవహరించాలని, రాజకీయాలకు ఏ మాత్రం ప్రభావితం కాకుండా నిజాయితీగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర డీజీపీ స్పెషల్ కేసుగా భావించి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
కొంతమంది ఆకతాయిలు, రౌడీలను అధికారంలో ఉన్న పార్టీలు దగ్గరకు తీసుకోవడం నేర ప్రవృతిని సమర్థించినట్లే అవుతుంది. అధికార పార్టీ అండ ఉందనే ధైర్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో పుసరావృతం కాకూడదు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడే విధంగా పోలీసు యంత్రాగం కృషి చేయాలి. పోలీసులు నిర్భయంగా వ్యవహరించాలి. రాజకీయాలకు ఏ మాత్రం ప్రభావితం కాకూడదు. రాష్ట్ర డీజీపీ స్పెషల్ కేసుగా భావించి తగిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. -సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కృషి చేస్తాం :దారుణ హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబాన్ని బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పరామర్శించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అమర్నాథ్ హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడాలని ఆయన కోరారు. జాతీయ స్థాయిలో హ్యూమన్స్ రైట్స్ కమిషన్కు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమర్నాథ్ హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలను తొలగించాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోమని గిడుగు రుద్రరాజు హెచ్చరించారు.
అధికార పార్టీ అండతోనే రాష్ట్రంలో దారుణ సంఘటనలు అమర్నాథ్ హత్యకు గురి కావడం చాలా బాధాకరం. ఈ విషయం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం. హ్యూమన్స్ రైట్స్ కమిషన్కు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాం. అమర్నాథ్ కుటుంబాన్ని న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. సాక్ష్యాలను తొలగించాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం. -గిడుగు రుద్రరాజు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు