ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ స్థలం వైసీపీకి కేటాయింపు.. రెవెన్యూ శాఖ రహస్య ఉత్తర్వులు - ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు

Bapatla RTC Land : బాపట్ల నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన రెండెకరాల ఆర్టీసీ స్థలం.. కారుచౌకగా వైసీపీ పరమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియకుండానే.. ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల లీజుతో వైసీపీ జిల్లా కార్యాలయానికి కేటాయిస్తూ రెవెన్యూశాఖ రహస్య ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులతోపాటు తహసీల్దారుకు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. అదే స్థలంలో వైసీపీ కార్యాలయానికి మంత్రులు శంకుస్థాపన చేయడం చర్చనీయాంశంగా మారింది.

Bapatla RTC Land
బాపట్లలో ఆర్టీసీ స్థలం

By

Published : Dec 20, 2022, 8:41 AM IST

Updated : Dec 20, 2022, 9:38 AM IST

Bapatla RTC Land : "ఆర్టీసీ స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం" శీర్షికతో ప్రచురితమైన కథనంతో.. బాపట్ల ఆర్టీసీ భూమి లీజ్ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆర్టీసీ బాపట్ల జిల్లా మేనేజర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, స్థానిక డిపో మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు.. కార్యాలయ శంకుస్థాపన సన్నాహాల్లో ఉన్న వైసీపీ జిల్లా పార్టీ కన్వీనర్‌, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావును కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూమి ఆర్టీసీ అధీనంలోనే ఉందని, ఎవరికీ కేటాయించలేదని చెప్పారు. వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి రెండెకరాల భూమిని 33 ఏళ్లకు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కలెక్టర్‌ ద్వారా తమకు అందాయని ఎంపీ మోపిదేవి తెలిపారు. దాంతో ఆర్టీసీ ఆర్‌ఎం, డీఎం బాపట్ల పట్టణ పోలీసులకు, తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీ స్థలం వైసీపీకి కేటాయింపు.. రెవెన్యూ శాఖ రహస్య ఉత్తర్వులు

అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా సరే.. మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ప్రకటించేశారు. ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ భూమిని రెవెన్యూ శాఖ ఎలా లీజుకిస్తుందని ప్రశ్నిస్తున్నాయి. బాపట్ల పారిశ్రామికవాడలోని 10.60 ఎకరాల భూమిని ఏపీఐఐసీ నుంచి 1990లో ఆర్టీసీ కొనుగోలు చేసింది. 6.60 ఎకరాల్లో ఆర్టీసీ బాపట్ల డిపో గ్యారేజ్‌ నిర్మించగా. మిగిలిన నాలుగెకరాల స్థలం సంస్థ అధీనంలో ఉంది. 216ఏ జాతీయ రహదారి బైపాస్‌ మార్గం సమీపంలో నుంచి వెళుతుండటంతో.. బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి విలువ 8 కోట్లకు పైగానే పలుకుతోంది. దాంతో వైసీపీ పెద్దలు రెండేళ్ల ముందే ఈ భూమిపై కన్నేశారు. నాలుగెకరాల్లో రెండెకరాలు వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి లీజుకివ్వాలని వైసీపీ నేతలు ప్రతిపాదనలు పంపగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరస్కరించారు. అందులో డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రం ప్రారంభిస్తామని, ఎవరికీ కేటాయించేది లేదని స్పష్టంగా చెప్పారు.

అప్పుడే అధికార పార్టీ మరో రూట్లో వచ్చింది. ఈసారి ఏపీఐఐసీ అధికారులను రంగంలోకి దింపింది. ఖాళీగా ఉన్న భూమిని తమకు తిరిగిస్తే పరిశ్రమలకు కేటాయిస్తామంటూ.. ఆర్టీసీని ఏపీఐఐసీ అధికారులు రెండు నెలల కిందట కోరారు. భూమి వెనక్కి ఇచ్చేది లేదని, ఆర్టీసీ అవసరాలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత తెరవెనుక చక్రం తిప్పిన వైసీపీ పెద్దలు బాపట్ల జిల్లా ఏర్పాటైన వెంటనే రెండెకరాల భూమిని 33 ఏళ్లపాటు వైసీపీ జిల్లా కార్యాలయానికి లీజుకు కేటాయించాలని కలెక్టర్‌ ద్వారా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆమోదం తెలిపి, వైసీపీ కార్యాలయానికి భూమిని కేటాయిస్తూ.. ఈ ఏడాది మే 18న సీసీఎల్​ఏ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఆర్టీసీకి కూడా తెలియకుండా జీవోను రహస్యంగా ఉంచారు. బాపట్లలో స్థలాన్ని ఏపీఐఐసీ గతంలో ఆర్టీసీకి అప్పగించిందని.. ఇప్పుడు ఏం జరిగిందో విచారణ జరిపిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

అయితే భూమిని ఆర్టీసీ వినియోగించనందున.. వెనక్కి తీసుకుంటూ 2003 డిసెంబర్ 8న ఆర్టీసీకి ప్రభుత్వం నోటీసులిచ్చిందని తహసీల్దార్ కవిత తెలిపారు. అక్కడున్న నాలుగెకరాల్లో రెండెకరాల భూమిని వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి.. ఏడాదికి వెయ్యి చెల్లించేలా ముప్పై మూడున్నరేళ్ల లీజుకిచ్చినట్లు వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details