ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల డిపో స్థలంపై చేతులెత్తేసిన ఆర్టీసీ .. వైసీపీ కార్యాలయం కోసమేనా.. - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Bapatla RTC Land Issuie: బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ కార్యాలయం కోసం లీజుకిచ్చిన వ్యవహారంపై.. ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది. 16 కోట్ల విలువైన స్థలాన్ని అధికార పార్టీకి ధారాదత్తం చేసేందుకు సమ్మతి తెలిపింది. ఆ స్థలం తమదేనని తొలిరోజు ఎండీ గట్టిగానే చెప్పగా.. రెండో రోజే హక్కు లేదంటూ యాజమాన్యం వివరణ ఇచ్చింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదునూ వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తీవ్రస్థాయి ఒత్తిళ్లతో.. ఆర్టీసీ యాజమాన్యం 24 గంటల్లోనే జీహుజూర్‌ అంటూ తలూపింది.

Bapatla RTC
బాపట్ల ఆర్టీసీ

By

Published : Dec 21, 2022, 7:32 AM IST

Updated : Dec 21, 2022, 12:51 PM IST

Bapatla RTC Land Issuie: ఇదీ.. బాపట్లలో రెండెకరాల ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి లీజుకు ఇచ్చారన్న కథనాలపై.. సోమవారం రోజున ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందన. ఆయనే కాదు.. బాపట్ల జిల్లా ప్రజారవాణా అధికారి, స్థానిక డిపో మేనేజర్‌, ఇతర ఆర్టీసీ సిబ్బంది.. బాపట్లలో వైసీపీ కార్యాలయానికి శంకుస్థాపన జరిగినచోట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దారుకు, ఎస్‌ఐకి ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఒక్కరోజులోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆర్టీసీ ప్రకటన ప్రకారం.. బాపట్ల సర్వే నెంబరు 1291/2Aలో 10.62 ఎకరాల స్థలాన్ని.. 1990లో ఏపీఐఐసీ నుంచి సేల్‌డీడ్‌ ద్వారా 3 లక్షల 60వేల 771 రూపాయలకు ఆర్టీసీ కొనుగోలు చేసింది. వెంటనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని.. 6.54 ఎకరాల్లో డిపో నిర్మించింది. భవిష్యత్తు అవసరాల కోసం 4.08 ఎకరాలను ఖాళీగా ఉంచింది. ఈ స్థలాన్ని అప్పగించాలంటూ 2002 డిసెంబర్ 27న ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఆర్టీసీకి లేఖ రాయగా.. ఆ స్థలాన్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో చెప్పాలంటూ 2003 ఏప్రిల్‌, ఆగస్టుల్లో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ తాఖీదులు ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. ఆ స్థలం ఏపీఐఐసీ పరమైనట్లు 2003 డిసెంబరు 8న బోర్డు కూడా ఏర్పాటుచేశారని తెలిపింది.

బాపట్ల డిపో స్థలంపై చేతులెత్తేసిన ఆర్టీసీ .. వైసీపీ కార్యాలయం కోసమేనా..

తాజాగా అధికారులను సంప్రదిస్తే.. 2003లోనే ఆ స్థలం ఏపీఐఐసీ పరమైనందున ఆర్టీసీకి హక్కు లేదని, రెవెన్యూశాఖ తీసుకునే తదుపరి పరిణామాలను ఆర్టీసీకి తెలియజేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు వివరించింది. ఇదే విషయాన్ని తమ సిబ్బందికి తెలియజేసి.. నిరసనలు కొనసాగించొద్దని చెప్పినట్లు ఆర్టీసీ వెల్లడించింది. పోలీసులకు, తహసీల్దారుకు ఇచ్చిన ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని కూడా డిపో మేనేజర్‌ను ఆదేశించినట్లు ఆర్టీసీ ప్రకటనలో పేర్కొంది.

బాపట్ల డిపో స్థలం విషయంలో ఒక్క రోజులోనే ఆర్టీసీ వైఖరి మారడంపై.. అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. వాటికి అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కొంత కాలం క్రితం ఆ స్థలం వెనక్కి తీసుకుంటామని ఏపీఐఐసీ అధికారులు లేఖ రాస్తే.. అందులో డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రం నిర్మిస్తామని అధికారులు బదులిచ్చారు. మరి 2003లోనే ఏపీఐఐసీ ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంటే.. ఇప్పుడు ఆర్టీసీ అధికారులను ఎందుకు సంప్రదించారన్నది అంతుచిక్కడం లేదు. 2003 నుంచి ఇప్పటివరకు 4.08 ఎకరాలను ఇతర పరిశ్రమలకు ఎందుకు కేటాయించలేదన్న ప్రశ్నకూ జవాబు దొరకడం లేదు. 2003 డిసెంబరులోనే ఆ స్థలంలో ఏపీఐఐసీ బోర్డు ఏర్పాటుచేస్తే.. ఆ విషయం ఆర్టీసీ అధికారులకు తెలుసా, తెలియదా..? సోమవారం హడావిడి చేసిన ఆర్టీసీ అధికారులు.. ఒక్కరోజులోనే ఎందుకు వెనక్కి తగ్గారు..? ఫిర్యాదులు ఉపసంహరించుకునేలా ఎవరి నుంచి ఒత్తిళ్లు వచ్చాయన్నది తేలాల్సి ఉంది.

ఆర్టీసీకి చెందిన 4.08 ఎకరాల ఖాళీ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని 2003లో ఏపీఐఐసీ నోటీసు ఇచ్చినట్లు.. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది. ఆర్టీసీ చెల్లించాల్సిన వివిధ పన్నులు, నిర్వహణ వ్యయాన్ని మినహాయించి.. 3 వేల చెక్కును ఆర్టీసీకి పంపింది. ఆ స్థలం తమ భవిష్యత్‌ అవసరాల కోసం ఉండాలని, వెనక్కి ఇచ్చేది లేదంటూ.. ఆ చెక్కును ఏపీఐఐసీకి ఆర్టీసీ తిప్పి పంపింది. అంటే ఆ స్థలం ఆర్టీసీ ఆధీనంలో ఉన్నట్లుగానే భావించాలి. కానీ ఇప్పుడది ఏపీఐఐసీ పరిధిలోకి వెళ్లినట్లు అధికారులు చెబుతుండటం ఆశ్చర్యపరుస్తోంది.

విలువైన స్థలాన్ని వైసీపీ కార్యాలయం కోసం తీసుకున్నందున.. ప్రత్యామ్నాయంగా బాపట్ల పరిధిలోనే మరోచోట ఆర్టీసీకి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నట్లు తెలిసింది. 4.08 ఎకరాల్లో 2 ఎకరాలు వైకాపా కార్యాలయానికి లీజుకు ఇవ్వగా, కొంత భాగంలో రహదారి నిర్మించారు. ఇంకా 1.8 ఎకరాలు మిగిలింది. అది దేనికీ సరిపోదని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో.. వేరొక చోట స్థలం కేటాయింపును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. చేసేదీమీలేక ఆర్టీసీ యాజమాన్యం అందుకు సమ్మతించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details