ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆయుష్‌'పై సర్కార్​ సవతి ప్రేమ.. మూతపడుతున్న ఆసుపత్రులు! - ఆయుష్‌ స్కీమ్​

Ayush Scheme: ప్రాచీన వైద్యాన్ని కాపాడుతూ రోగులకు సేవలు అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆయుష్‌’పై ప్రభుత్వం సవతి ప్రేమను కనబరుస్తోంది. వైద్యుల నియామకాలు, అభివృద్ధి చర్యల గురించి పట్టించుకోకపోవడంతో ఈ డిస్పెన్సరీల ద్వారా రోగులకు వైద్య సేవలు అందడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

ayush scheme
ayush scheme

By

Published : Jul 26, 2022, 4:18 AM IST

Ayush Scheme: వైద్య, ఆరోగ్యశాఖలో అంతర్భాగంగా ఉన్న ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్‌) విభాగం సుప్తచేతనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ప్రాచీన వైద్యాన్ని కాపాడుతూ రోగులకు సేవలు అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆయుష్‌’పై ప్రభుత్వం సవతి ప్రేమను కనబరుస్తోంది. వైద్యుల నియామకాలు, అభివృద్ధి చర్యల గురించి పట్టించుకోకపోవడంతో ఈ డిస్పెన్సరీల ద్వారా రోగులకు వైద్య సేవలు అందడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాల, పూనూరు హోమియో వైద్యశాలలు వైద్యులు లేక మూతపడ్డాయి.

ఆయుష్‌ ద్వారా ఆయుర్వేదం, యునాని, హోమియో ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా 750 నడుస్తున్నాయి. ఇందులో 136 వరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద మంజూరయ్యాయి. ఒక్కొక్క డిస్పెన్సరీలో ఒక వైద్యుడు, ఫార్మసిస్టు, వాచ్‌మన్‌ ఉండాలి. వైద్యుల కొరతవల్ల జిల్లా అధికారులు ఒక్కొక్క వైద్యుడికి రెండు, మూడు డిస్పెన్సరీల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వీరిలో కొందరు ఏ డిస్పెన్సరీకి వెళ్లకుండా కాలం వెళ్లదీస్తున్నారు. పలువురు వైద్యులు ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ నిత్యం ప్రైవేటు ప్రాక్టీసులోనే ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తంమ్మీద 180 డిస్పెన్సరీల్లో అసలు వైద్యులు లేరని తెలుస్తోంది. వీటిల్లో పనిచేసే వాచ్‌మన్‌, ఫార్మసిస్టులు మిడిమిడి జ్ఞానంతో అక్కడికి వచ్చే రోగులకు మందులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

‘ఓపీ’ గణాంకాలు ఓ మాయ!
ఈ డిస్పెన్సరీల్లో ప్రతిరోజు కనీసం 25వేల మంది రోగులు ఓపీ ద్వారా చికిత్స పొందుతున్నారని లెక్కలు చూపిస్తున్నారు. కానీ .. కొన్ని డిస్పెన్సరీలకు రోజుకు పట్టుమని 10 మంది రోగులూ రావడంలేదు. మరోవైపు రోగులకు అవసరమైన మందులు డిస్పెన్సరీల్లో అందుబాటులో ఉండటం లేదు. ఆయుర్వేద కళాశాల నుంచి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉండే డిస్పెన్సరీల వరకు ఇదే పరిస్థితి. నిధుల కొరతవల్ల ముఖ్యమైన మందులూ ఉచితంగా ప్రజలకు అందడం లేదు.

ఇవీ చదవండి:పోలవరానికి ఏదీ పె'న్నిధి'?.. ఈ మూడేళ్లలో ఖర్చు అంతంతే!

ABOUT THE AUTHOR

...view details