Auto Driver saved : పిల్లలు అంటేనే ఆడుతూ, పాడుతూ ఉంటారు. ఇలా వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతారు. అందులో చదువు కూడా వారికి ఓ ఆటవిడుపే. పిల్లల జీవితంలో చదువును ఎదుగుదలకు తోడ్పడే ఓ జ్ఞాన సమపార్జనగానే భావించాలి. అంతేగానీ, చదువే పిల్లల బాధ్యత అనేలా ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసమో.. తల్లిదండ్రులు ఓసారి ఆలోచించాలి. టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఇటీవల కాలంలో.. చదువుతో పాటు, అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ టెక్నాలజీ వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.
ఇలా పక్కదారి పట్టిన ఓ పసి విద్యార్థులు.. పుస్తకాలు పోగొట్టుకుని, పరీక్షలు బాగా రాయలేకపోయారు. దీంతో ఈ విషయం తెలిస్తే.. తల్లిదండ్రులు కొడతారేమోనన్న భయం.. వారిని ఆత్మహత్య వైపు పురిగొల్పింది. ఆలోచన వచ్చిందే తడవు.. దగ్గర్లో ఉన్న సముద్రం వద్దకు చేరుకున్నారు. వారిని తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్, ఆ పసి విద్యార్థుల ఆందోళనను పసిగట్టి, నేరుగా పోలీసుల చెంతకు చేర్చాడు. పిల్లల ఆలోచనను గమనించిన పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయి.. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
ఇదీ జరిగింది..పల్నాడు జిల్లాలోని నరసరావుపేటకు చెందిన ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు తోట వినయ్,షేక్ ముస్తఫాలు నరసరావుపేట నుంచి ఆర్టీసీ బస్సులో చీరాలలో దిగి ఆటోను ఆపారు. చీరాల మండలం వాడరేవు సముద్రతీరం వైపు తీసుకెళ్లమని వారు చీరాలకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను కోరారు. డ్రైవర్ కూడా సరే అని వారిని ఆటోలో ఎక్కించాడు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో విద్యార్థులు ఆత్మహత్య గురించి మాట్లాడుకోవడాన్ని డ్రైవర్ విన్నాడు. ఆ సమయంలో సమయస్ఫూర్తితో ఆటోడ్రైవర్ ఏసుబాబు.. వారిని నేరుగా చీరాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు.
పుస్తకాలు పోగొట్టుకోవడం వల్ల.. పరీక్షల్లో ఫెయిల్ అవుతామని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. తల్లిదండ్రులు తిడతారన్న భయంతో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు చీరాల వచ్చినట్టు పోలీసులకు తెలిపారు విద్యార్దులు. దీంతో నిర్షాంతపోయిన పోలీసులు.. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. చూశారా..? ఆటో డ్రైవర్ గమనించకపోయి ఉంటే.. రెండు పసిమొగ్గలు రాలిపోయేవి. అందుకే తల్లిదండ్రులూ…! పిల్లలతో ప్రేమగా మెలగండి.
మరో ఘటనలో ఐదుగురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..బాపట్ల మండలం సూర్యలంక బీచ్ అవుట్ పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. సూర్యలంక సముద్రతీరంలో తిరుగుతూ వున్న ఐదుగురు పిల్లలను గుర్తించారు. ఆ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు గానీ, పెద్దలు గానీ ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు పిల్లలను విచారించగా.. సరదాగా బీచ్‌కు వచ్చామని తెలిపారు.
ఐదుగురు విద్యార్థులు హమీద్(12), లాల్ జాన్ బాషా (12), తాటి తరుణ్ (12), ఇమామ్(9), తాటి భూషణం నాయుడు(11), వీరందరిదీ గుంటూరు నగరానికి చెందిన నల్లచెరువు ప్రాంతం అని తెలుసుకుని, ఎవరికి చెప్పకుండా సూర్యలంక బీచ్‌కు వచ్చినట్లు నిర్దారించుకున్న పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాపట్ల రూరల్ ఎస్సై సమక్షంలో వారికి కౌన్సిలింగ్ చేసి ఐదుగురు పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు ఏం చేస్తున్నారు?ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరెవరితో తిరుగుతున్నారు? వంటి వాటిని గమనించుకుంటూ ఉండాలని పోలీసులు తల్లిదండ్రులకు పోలీసులు తెలిపారు. పిల్లలు చెడు అలవాట్లను నేర్చుకున్న తర్వాత వారిని మందలించే కంటే, మొదటి నుంచి వారు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికల పట్ల నిఘా ఉంచాలని సూచించారు.
ఇవీ చదవండి: