Illegal rice trade:బాపట్ల జిల్లాలో అధికారపక్షం అండతోనే యధేచ్చగా అక్రమ బియ్యం వ్యాపారం సాగుతోంది. ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎన్నిసార్లు దాడులు చేసి అక్రమ బియ్యం దందాను అడ్డుకుందామన్నా ఫలితాలనివ్వడం లేదు. అధికారపక్షనేత నల్లబజారు వ్యాపారులకు శ్రీరామరక్షగా నిలవడం చర్చనీయాంశమైంది. చిన్న కేసుల మూలంగా తేలికపాటి జరిమానాలు, శిక్షలను విధించడంతో పట్టుకున్న కొద్దిరోజులకే బయటకు వచ్చేస్తున్నారు. ఒకసారి చిక్కినవారు మళ్ళీ మళ్ళీ పట్టుబడుతున్నా ఏమాత్రం రేషన్ బియ్యం దందాను నిలువరించలేకపోవడం గమనార్హం. ఫలితంగా అక్రమ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే ఉంది.
అధికారపార్టీ ప్రజాప్రతినిధి రైస్ మిల్లులోనే..: బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో అధికారపార్టీ ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 625 రేషన్ బియ్యం బస్తాలను పట్టుకున్నారు. ఇదే మిల్లులో రేషన్ బియ్యం పట్టుకోవడం గత నాలుగు నెలల్లో ఇది మూడోసారి... అయినా వదలకుండా బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారంటే.. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా అధికార పక్ష నేత అండ ఉన్నంతవరకూ తమను ఏమీ చేయలేరన్న ధీమా స్పష్టంగా కనపడుతోంది. అక్రమంగా బియ్యం సేకరణ, తరలింపు ఎంతటి లాభసాటి వ్యాపారమో ఇట్టే అర్ధమవుతోంది. పేదల బియ్యం అక్రమ వ్యాపారానికి ముడి సరుకుగా మారింది.
భయంలేని నల్లబజారు వ్యాపారులు..: పోలీసులు, ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకుంటున్నా నల్లబజారు వ్యాపారులు మాత్రం భయపడటం లేదు. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయల రేషన్ బియ్యం తరలిస్తున్నా.. అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు.. దీనికి ప్రధాన కారణం బియ్యం మాఫియాకి వెన్నుదన్నుగా అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటమే కారణమని తెలుస్తోంది. రోజుకు వందలాది బస్తాలు రాష్ట్ర సరిహద్దులు దాటి పోతున్నాయి.
లాభాలిలా..: పేదలకు పంపిణీ చేసేందుకు కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.38.50 వెచ్చిస్తుంది.. లబ్దిదారులకు కిలో రూపాయి చొప్పున అందిస్తుంది. కార్డుదారుల నుండి కొందరు రేషన్ డీలర్లు కిలో 8 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. చీకటి వ్యాపారస్తులకు కిలో 12 రూపాయలు చొప్పున డీలర్లు విక్రయిస్తున్నారు. వీటిని అక్రమ వ్యాపారులు కిలో 15 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. చౌక బియ్యం అక్రమంగా రవాణా చేసేవారు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. లారీ వెళ్లే సమయంలో తమ అనుచరులను ఏర్పాటు చేసుకుని నిఘా లేదని నిర్దారించుకున్న తరువాత లారీలు బయలుదేరి నల్లబజారుకు వెళతాయి.