AP govt Tidco houses structure updates: వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అరకొర వసతులతో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. అద్దెలు భరించలేక కొంతమంది అక్కడికి వెళ్లినా.. మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు. మరికొందరు ఆ ఇళ్లవైపే కన్నెత్తి చూడటం లేదు. అరకొర వసతులతో ఇబ్బంది పడలేమని.. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తేనే వెళ్తామని తేల్చి చెబుతున్నారు.
పట్టణ పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాలను ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు.. పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం, ఉద్యానవనాలు, నడక మార్గాలు, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలు కల్పించింది. నెల్లూరులో 80కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అన్నిచోట్ల ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం.. రెండేళ్ల పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోలేదు. ఇప్పుడు అరకొర సౌకర్యాలతో లబ్ధిదారులకు అందిస్తూ.. అక్కడి మౌలిక సదుపాయల బాధ్యతను పురపాలక సంఘాలకే వదిలేసింది. లబ్ధిదారులు వేలల్లో ఉన్నందున అక్కడ పాఠశాలలు, వసతిగృహాలు, అర్బన్ క్లినిక్‌లు, ఇతర వాటి ఏర్పాటుకు అన్ని శాఖలకు నివేదిస్తామని చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకొస్తే పార్కు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసే వీలుంటుందని అధికారులు అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 46వేల ఇళ్లను అప్పగించగా.. అందులో గత ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తవ్వగా, 10శాతం పనులు ఇప్పుడు చేసి అందజేస్తున్నారు. అత్యధిక శాతం పూర్తయిన ఇళ్లున్న చోటే అరకొరగా మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించేస్తున్నారు. తక్కువ శాతం నిర్మాణాలు పూర్తయిన వాటిని రెండో ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాలున్న గృహసముదాయాల్లో తాగునీరు, రహదారులు, మురుగుకాలువలు, విద్యుత్తు సౌకర్యం, ఎస్టీపీ తరహా మౌలిక సదుపాయాల కల్పనకు 3 వేల కోట్లు అవసరమవుతుందని అధికారుల అంచనా. ఇప్పటి వరకు సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులో 300 కోట్లు గత ప్రభుత్వ హయాంలోనే ఖర్చు చేశారు.
టిడ్కో గృహసముదాయాల్లో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని... నిర్వహణ సరిగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే కనీస వసతులు కూడా పూర్తిస్థాయిలో కల్పించకుండానే లబ్ధిదారులకు ఇళ్లు అంటగట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల పరిధిలో లబ్ధిదారులకు అప్పగించిన 8 గృహ సముదాయాల్లో ‘ఈనాడు- ఈటీవీ’ ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన చేయగా.....90 శాతం గృహసముదాయాల్లో తాగునీటి సమస్య ఉంది. కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా.. సరిపడా అందడం లేదు. 55 శాతం వరకు విద్యుత్తు సౌకర్యం లేదు. 33 శాతం మురుగు కాలువల సమస్య ఉంది. విశాఖలోని సుద్దగెడ్డలో మొత్తం 240 ఇళ్లు పంపిణీ చేయగా.. వసతలు లేవని ఒక్కరూ చేరలేదు.