YCP leader making illegal collections from traders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా అధికార పార్టీకి చెెందిన కొంతమంది నాయకులు, నియోజకవర్గాల్లో ఉండే ముఖ్య నేతలు.. పార్టీ అండదండలను చూసుకుని అక్రమ వ్యాపారాలకు, భూ దందాలకు, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. వారి అక్రమాలకు సంబంధించిన వాస్తవాలు ఏదో ఒక రూపంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వైసీపీ ముఖ్య నేత.. గ్రానైట్, క్వారీ, ఇసుక వ్యాపారులు, శీతల గిడ్డంగుల యజమానులు, రేషన్ బియ్యం రవాణాదారుల నుంచి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ.. యథేచ్ఛగా తన వ్యాపారాన్ని సాగిస్తున్నాడంటూ.. అదే పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచి.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాయటం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరి ఎవరా ఆ ముఖ్య నేత..?, ఎన్ని కోట్లా అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు..?, సీఎం జగన్‌కు లేఖ రాసిన ఆ సర్పంచ్ ఎవరు..?, ఆ లేఖలో ఏముంది..? అనే వివరాలను తెలుసుకుందామా..
సీఎం జగన్‌కు దగ్గుబాడు గ్రామ సర్పంచ్ లేఖ..బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఓ వైసీపీ ముఖ్య నేత.. నియోజకవర్గంలో వ్యాపారాలు చేసుకుంటున్న.. గ్రానైట్, క్వారీ, ఇసుక వ్యాపారులు, శీతల గిడ్డంగుల యజమానులు, రేషన్ బియ్యం రవాణాదారుల నుంచి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ.. కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామ సర్పంచి గేరా రవీంద్రనాథ్ ఠాగూర్ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆ ముఖ్య నేత పేరును ప్రస్తానించకుండా అతడు చేస్తున్న అక్రమ వసూళ్ల దందా గురించి విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, పార్టీ వర్గాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఆ లేఖలో పేర్కొన్న విషయాలు.. ''ఆ నాయకుడు నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్ వ్యాపారుల నుంచి ప్రతి నెల రూ.1.51 కోట్లు, గ్రావెల్ నుంచి రూ.22.50 లక్షలు, ఇసుక లారీల నుంచి రూ.కోటి, కోల్డ్ స్టోరేజీల నుంచి రూ.9.60 లక్షలు, రేషన్ బియ్యం మాఫియా నుంచి రూ.50 లక్షలు చొప్పున నెలకు రూ.3.33 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇక్కడి ముఖ్య నేత పాల్పడుతున్న అవినీతిని తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ లేఖను రాసి ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాను.
మార్టూరు నుంచి నిత్యం 60-70 వాహనాల్లో గ్రానైట్ ఇతర రాష్ట్రాలకు తరలుతుంది. బిల్లుల్లేకపోయినా వాటిని ఎక్కడా ఆపకుండా పంపేందుకు ఒక్కో లారీకి వ్యాపారుల నుంచి రూ.35 వేలు వసూలు చేస్తున్నారు. అందులో రూ.8 వేలు ఆ నాయకుడు తీసుకుంటారు. దీంతో ప్రభుత్వం జీఎస్టీ, రాయల్టీ కోల్పోతోంది. ముఖ్య నేత నియమించిన ప్రైవేటు వ్యక్తులు నియోజకవర్గంలో తిరుగుతూ.. వసూళ్లకు పాల్పడుతున్నారు. వారికి లంచాలు ఇవ్వనివారి లారీలను పట్టిస్తున్నారు. మార్టూరు మండలంలోని ఐదు మట్టి క్వారీలను గతంలో మూసివేయించారు. వాటిలో రెండు వైసీపీ నాయకులవే. తొలుత మూసివేయించి, తర్వాత తెరిపించి వారి నుంచి రోజువారీ వసూళ్లకు పాల్పడుతున్నారు.'' అని దగ్గుబాడు గ్రామ సర్పంచి గేరా రవీంద్రనాథ్ ఠాగూర్ లేఖలో వివరించారు.
లేఖను..సీఎంకు, పార్టీ పెద్దలకు పంపాను..ఈ సందర్భంగా దగ్గుబాడు గ్రామ సర్పంచ్ గేరా రవీంద్రనాథ్ ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ..''ఆ ముఖ్య నేత అవినీతి గురించి రెండు రోజుల క్రితమే.. సీఎం జగన్‌తో పాటు పార్టీ పెద్దలు విజయసాయి రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులకు వాట్సప్‌లో పంపాను. ఇప్పటికే వారు ఆ లేఖ చూశారు. పార్టీకి పట్టుగొమ్ములుగా ఉన్న ఎస్సీలను అణగదొక్కుతున్నారు. దళిత సర్పంచిని అయిన నన్ను ఇబ్బంది పెడుతున్నారు.