Ganja seized in Martoor: గంజాయి అక్రమరవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని.. గంజాయి అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు.. బాపట్ల పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మార్టూరు పోలీస్లు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో కారును అపి సోదా చేయగా.. సుమారు రూ 4 లక్షల 41వేల రూపాయల విలువ గల 98 కేజీల గంజాయి గుర్తించామన్నారు. వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు.. కేరళకు చెందిన పుదియపురైల్, అశోక్, చమ్ము, వడక్కన్చెర్రీ అనే ముగ్గురు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన అత్తిలి ప్రభాకర రావు, అనకాపల్లి జిల్లాకు చెందిన బొండాడ కోదండ రాముడులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ముద్దాయిలందరికి గంజాయి సేవించే అలవాటు ఉందని.. అక్రమంగా తీసుకొచ్చిన గంజాయిని అమ్ముతుంటారని తెలిపారు. మొదటి ముద్దాయి సమ్మద్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ గతంలో కొద్ది మొత్తంలో గంజాయిని రవాణా చేస్తుండేవాడని.. రెండవ ముద్దాయి అయిన అశోక్ బెంగళూరు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తూ ఉంటాడు.. మూడవ ముద్దాయి చమ్ము గంజాయి అక్రమ రవాణా చేసే వారికి సహాయకుడిగా ఉంటాడు.. మరో ఇద్దరు ముద్దాయిలు ప్రభాకర్, కోదండరాములు ఒడిశా బోర్డర్ ప్రాంతంలో గిరిజనుల దగ్గర గంజాయి కొనుగోలు చేసి అమ్మే దళారీలుగా మారారని పేర్కొన్నారు.. సమ్మద్కి ప్రభాకర్, కోదండరాములకి మధ్య.. గతంలో పరిచయాలు ఉన్నాయి. ఇటీవల సమ్మద్కి బెంగళూరులో అశోక్ కూడా పరిచయం అవటంతో వీరందరూ కలిసి ఒడిశాలోని గంజాయిని మద్దిగరువు దగ్గరకు తీసుకురాగా, ప్రభాకర్ రావు, కోదండ రాముడు ఇరువురు వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి ప్యాకెట్ రూ. ఐదు వేల చొప్పున 49 గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి.. అక్కడనుంచి రహస్యంగా నక్కపల్లి టోల్గేట్ సమీపంలోకి తరలించి, కేఎల్ 11 డబ్ల్యూ 4308 నెంబర్ గల టాటా ఇండిగో కారులో.. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి బెంగళూరుకు బయలుదేరారు.