Disputes Concluded in between two Fishing communities: బాపట్ల జిల్లాలో గత మూడు నెలలుగా మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. దీంతో తీర ప్రాంతానికి చెందిన పెద్దలు, పోలీసులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం మత్స్యకార గ్రామంలో మూడు నెలల క్రితం ఓ వివాదం నెలకొంది. ఇదే గ్రామానికి చెందిన ఒకరు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు అతడిని నిలదీశారు. ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలకు సర్దిచెప్పారు. అయినా సమస్య అలాగే ఉంది. దీంతో చేతబడి చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గీయులకు చెందిన 85 కుటుంబాలు గ్రామాన్ని విడిచి మరొక ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. వీరి మధ్య రాజీ చేయటానికి గత శనివారం తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకార పెద్దలు ప్రయత్నించగా.. మాటమాటా పెరిగి తోపులాట జరిగింది. దీంతో మళ్లీ కేసులు పెట్టుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ పహారా ఏర్పాటు చేశారు.
తాజాగా బుధవారం రాత్రి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన మత్స్యకార పెద్దలు విచ్చేసి వీరి మధ్య సయోధ్య చేయడానికి రామాపురం గ్రామంలోని రామాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాత్రి వరకు వీరి మధ్య జరిగిన చర్చలు అనంతరం అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఇటు గ్రామస్థులు, తీరప్రాంత పెద్దలు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాపట్ల డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.