Police Picketing in Bapatla District: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామస్థుల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రామాపురం - కఠారివారిపాలెం గ్రామాల మధ్య పోలీస్ పికిటింగ్ కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు, చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఈ రెండు గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు మత్స్యకార గ్రామల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది.
మూడు నెలల క్రితం రామాపురానికి చెందిన ఒకరు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు నిలదీశారు. దీంతో ఆ వర్గానికి చెందిన 85 కుటుంబాలు గ్రామం విడిచి కఠారివారిపాలెం సమీపంలో గుడారాలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వీరి మధ్య ఉన్న అపోహలు తొలగించి అందర్ని ఒకటి చేసే నిమిత్తం తీరప్రాంత గ్రామాలకు చెందిన పెద్దలు ప్రయత్నం చేయగా.. ఈ క్రమంలో కొద్దిపాటి తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్పందించిన పోలీసులు అక్కడ పికెట్లు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వీరిని కలిపేందుకు ఈ నెల 24వ తేదీన మరోసారి మత్స్యకార గ్రామ పెద్దలు సమావేశం కానున్నారు. అప్పటివరకు పహారా కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు.