YSRCP Activists Attack On TDP Leader : అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరగ్గా.. వారం రోజుల కిందట జిల్లా కేంద్రమైన రాయచోటిలోని ఐసీడీఎస్ కార్యాలయ ఉద్యోగులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలు మరువకముందే తాజాగా రామాపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున నాయుడు అనే టీడీపీ కార్యకర్తపై.. అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో.. పని చేయకుండానే కొందరి పేర్లపై బిల్లులు పొందుతున్నారని మల్లికార్జున నాయుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గ్రామ సమీపంలో అడవి జంతువులను కొందరు కార్యకర్తలు చంపేస్తున్నారని గతంలో ఫిర్యాదు నమోదైంది. అయితే మల్లికార్జున్ నాయుడే తమపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు అన్న అనుమానంతో.. పది రోజులుగా అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో మల్లికార్జున్ ముందస్తుగా తనకు వైసీపీ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని రెండు రోజులు ముందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.