YCP MLA Followers Attack on Common Man: వైసీపీ నాయకులు, వారి అనుచరుల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రభుత్వం, వైసీపీ నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ గొంతెత్తేవారిని వెంటాడి మరీ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకోవడం కలకలం రేపింది. రాజంపేటకు చెందిన చిరు వ్యాపారి పత్తి మణిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరులు కత్తులు, రాడ్లతో పాశవికంగా దాడి చేశారు.
''ఇది రాచరిక పాలన కాదు. వారసత్వ రాజకీయం చేయడానికి.. ఇది ప్రజాస్వామ్యం'' అంటూ.. పత్తి మణి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ నేతను ఉద్దేశించి చేసినవేనని భావించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరులు.. పత్తి మణిని అపహరించి దాడి చేశారు. రాజంపేట హరిత హోటల్‌లో వేచి చూసిన వైసీపీ కార్యకర్తలు.. అక్కడికి రావాలని పత్తి మణికి ఫోన్ చేశారు. పోస్టు పెట్టినందుకు.. వచ్చి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించడంతో.. పత్తి మణి అక్కడికి వెళ్లారు.
వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వినకుండా.. రెండు వాహనాల్లో వచ్చిన వైసీపీ కార్యకర్తలు.. అతడ్ని కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళ్లారు. రాజంపేట నుంచి ఓబులవారిపల్లె మీదుగా చిట్వేలు వరకు వాహనంలో కొట్టుకుంటూ తీసుకెళ్లారని బాధితుడు వాపోయారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఒక కన్ను మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది.