YCP Leaders Occupying Government Land In Annamaiya District: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రకంపనలు సృష్టించిన ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కొరఢా ఝులిపించారు. 120 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 13 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కడప గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిని బదిలీ చేశారు. రికార్డులు ట్యాంపర్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
ఈనాడు-ఈటీవీ వరుస కథనాలతో రాయచోటిలో ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ నాయకులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిని బదిలీ చేశారు. కడప అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయానికి ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె స్థానంలో కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్‌గా సుందరేశానికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించగా ఆయన విధుల్లో చేరారు. రాయచోటిలోని సర్వేనంబరు 971/1లో ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు గజేంద్రరెడ్డి, హరినాథ్ రెడ్డి, జింకా రమేష్, యూసఫ్ కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నవంబరు 9న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 120 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయకులు, సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిపై ఇప్పటికే రాయచోటి పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి సోమవారం రాయచోటి పోలీసులు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి విచారణ చేసి వెళ్లారు. రిజిస్ట్రేషన్ జరిగిన రికార్డులను పరిశీలించారు.