ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు రాజ్యం తెస్తామని.. రైతులేని రాజ్యం చేశారు.. సీఎం జగన్​పై లోకేశ్ ధ్వజం - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍

Yuvagalam padayatra 43rd day : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ చేపట్టిన యువగళం పాదయాత్ర 43వ రోజు కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం గుట్టపాలెం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు ముందు సెల్ఫీ విత్‍ నారా లోకేశ్‍ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

నారా లోకేశ్‍ యువగళం పాదయాత్ర 43వ రోజు
నారా లోకేశ్‍ యువగళం పాదయాత్ర 43వ రోజు

By

Published : Mar 15, 2023, 7:45 PM IST

నారా లోకేశ్‍ యువగళం పాదయాత్ర 43వ రోజు

Yuvagalam padayatra 43rd day : రైతు రాజ్యాన్ని తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి... రైతులేని రాజ్యం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర 43వ రోజు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. గుట్టపాలెం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. అడుగడుగునా మహిళలు హారతులు పడుతుండగా.. టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

రైతులతో సదస్సు..తంబళ్లపల్లి నియోజకవర్గం బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద భోజన విరామం అనంతరం టమాటా రైతులతో నిర్వహించిన సదస్సులో నారా లోకేశ్ పాల్గొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని లోకేశ్‍ తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ లేదని.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు అమాంతం పెంచేశారని ఆరోపించారు. రూ.3,500కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న జగన్‍... రైతులను నడిరోడ్డున పడేశారని దుయ్యబట్టారు. హంద్రీనీవాను 90శాతం టీడీపీ పూర్తి చేస్తే.. మిగిలిన 10శాతం పూర్తిచేయలేక పోయారని ఆరోపించారు.

రైతులను మోసం చేశారు..పాదయాత్ర చేస్తూ మదనపల్లి వచ్చిన జగన్ టమాటా గుజ్జు పరిశ్రమ, శీతల గిడ్డంగులు పెట్టి రైతులను ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు గుర్తొచ్చిన టమాటా రైతులు.. అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డికి కనిపించకపోవడం దారుణమన్నారు. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ మదనపల్లిలో ఉందని... టమాటా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జగన్ రెడ్డి రైతు రాజ్యం పేరుతో... రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నాడని ఆరోపించారు. రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి రూ.6వేలు బకాయిపడ్డాడని.. 5 ఏళ్లలో 30వేల రూపాయలు రైతుకు బకాయి పెడుతున్నాడని ఆరోపించారు.

రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కు నెట్టారు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని... టమాటా పల్పింగ్ యూనిట్ పెడతామన్నారు. ఒక్క ఛాన్స్ అని ముందుకు వచ్చిన జగన్‍...రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టాడని ఆరోపించారు. చెరకు ఫ్యాక్టరీల భూములను కొట్టేసేందుకు జగన్ రెడ్డి వాటిని కుట్రపూరితంగా మూయిస్తున్నాడని.. రాయలసీమలో మిగిలి ఉన్న ఒక్క చెరకు ఫ్యాక్టరీని కూడా మూసేందుకు సిద్ధంగా ఉన్నాడని లోకేశ్‍ తెలిపారు. రైతు భ‌రోసా పేరుతో కేవలం 7,500 రూపాయలు ఇస్తే అవి ఎలా ఉపయోగకరమో రైతులంతా ఆలోచించాలన్నారు. ఏటా భూసార పరీక్షలు చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని విస్మరించారన్నారు. 2024లో ముఖ్యమంత్రి పదవి ఓ ముళ్ల కిరీటం అనిపిస్తోందని... 1995 నాటి పరిస్థితులు 2024లో రాబోతున్నాయని... కష్టాలను అధిగమించి రైతులను ఆదుకోవడమే తమ కర్తవ్యమని లోకేశ్‍ తెలిపారు.

రెచ్చగొట్టిన వైఎస్సార్సీపీ కార్యకర్త... నారా లోకేశ్‍ యువగళం పాదయాత్రలో 43వ రోజు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల పరిధిలోని గట్టు గ్రామానికి పాదయాత్ర చేరుకున్న సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. దారి పక్కన ఉన్న వైఎస్‍ రాజశేఖర్‍ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. లోకేశ్‍ ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలోనే రెచ్చగొట్టే రీతిలో ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో పాదయాత్రలో పాల్గొంటున్న టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురై.. రెచ్చగొట్టేలా వ్యవహరించిన వైఎస్సార్సీపీ కార్యకర్తను వెంబడించారు. పోలీసులు కలుగచేసుకుని టీడీపీ కార్యకర్తలను నిలువరించడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ వచ్చాక ఉర్దూ టీచర్ల బ్యాక్ లాగ్ పోస్టులు..మైనార్టీల్లో పేదరికం లేకుండా చేయడమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలు వారి స‌మ‌స్యలను లోకేశ్‍ కు తెలిపి వినతులు అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తులు కాపాడటానికి న్యాయాధికారాలు కల్పిస్తామని తెలిపారు. తంబళ్లపల్లెలో తాలిబాన్ పాలన నడుస్తోందని ఆరోపించారు.

మైనారిటీలపై దాడులు.. టీడీపీ హయాంలో ముస్లింలకు చేసిన అభివృద్ధి గురించి తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉర్దూ టీచర్ల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ముస్లింలపై దాడులు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు. చిన్నాన్నను చంపిన వ్యక్తి తరఫున ప్రభుత్వ లాయర్లను పెడుతున్న జగన్‍... ముస్లిం రిజర్వేషన్ల కోసం మాత్రం పోరాడటం లేదని ఆరోపించారు. దుల్హన్ కింద టీడీపీ 50 వేల రూపాయలు ఇచ్చేదని... కానీ, జగన్ లక్ష ఇస్తా అని మోసం చేశారన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన తొలగించి.. పాత ఫీజురీయింబర్స్ మెంట్ విధానం ప్రవేశపెడతామన్నారు. జగన్ తెచ్చిన పథకం వల్ల పేద తల్లిదండ్రులపై భారం పడుతుందని తెలిపారు. తంబళ్లపల్లెకి పరిశ్రమలు రాకపోవడానికి కారణం పాపాల పెద్దిరెడ్డి కుటుంబమేనని దుయ్యబట్టారు. పరిశ్రమలు పెట్టాలంటే వాటా ఎంతిస్తారని అడుగుతున్నారని... పాపాల పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించకపోతే నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు పేదరికంతోనే జీవించాల్సి వ‌స్తుందన్నారు. 10 వేల కోట్ల రూపాయలను నాలుగేళ్లలో దోచుకున్నారని.... నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. ఇక్కడికి ఒక్కసారైనా సీఎం జగన్ రెడ్డి వచ్చారా..? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పాపాలు సీఎంకు కనబడవు, వినబడవని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details