papikondalu Boat Yatra Resumes: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి అలలపై బోటులో సాగిపోయే పాపికొండల యాత్రను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తిరిగి ప్రారంభించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారాన్ని పునరుద్ధరించినట్లు సంస్థ తెలిపింది. ప్రతి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి బయలుదేరే బస్సు మరుసటి రోజు (శనివారం) వేకువజామున 5 గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
భక్తులు అక్కడ స్నానాలు ముగించుకుని ఉదయం 7 గంటలకు రాములవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడే కొన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చి ఉదయం 8.30 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. పేరంటాలపల్లి మీదుగా కొల్లూరుకు బోటులో చేరుకుంటారు. బోటులోనే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి కొల్లూరులోని బాంబూహట్స్‌లో బస చేస్తారు. మూడోరోజు (ఆదివారం) ఉదయం కొల్లూరులో అల్పాహారం ముగించుకుని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, నదీ స్నానం పూర్తి చేస్తారు.