Lokesh yuvagalam padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 44వ రోజు ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి లోకేశ్ నివాళులర్పించారు. అనంతరం సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగన్ హామీలు విస్మరించారు.. ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రం వద్ద శ్రీ వెంకటేశ్వర బుడుగజంగ సంక్షేమ సంఘ నాయకులు లోకేశ్‍ను కలిసి సమస్యలను వివరించారు. చిరువ్యాపారాలు చేసుకుంటూ బతుకుబండి లాగిస్తున్న తాము దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన బహిరంగసభలో అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని తెలిపారు.
న్యాయం చేస్తామని హామీ... ఓట్లకోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ తర్వాత మాటతప్పి మడమతిప్పడం జగన్మోహన్ రెడ్డి నైజమని లోకేశ్ ఆరోపించారు. బుడుగ, బేడజంగాల సమస్యపై అధ్యయన కమిటీ నివేదిక పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రం నుంచి మల్లెల క్రాస్, టి.సదుం క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతోంది. టి.సదుం క్రాస్ వద్ద కర్ణాటక సాంప్రదాయలను తలపిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాదయాత్రకు స్వాగతం పలికారు.
రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం..బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద భోజన విరామం అనంతరం టమాటా రైతులతో నిర్వహించిన సదస్సులో నారా లోకేశ్ పాల్గొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం లేదని, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు అమాంతం పెంచేశారని ఆరోపించారు. రూ.3,500కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న జగన్... అధికారంలోరి వచ్చాక వీధిన పడేశారని దుయ్యబట్టారు. మదనపల్లిలో టమాటా గుజ్జు పరిశ్రమ, శీతల గిడ్డంగులు పెట్టి రైతులను ఆదుకుంటామని చెప్పిన జగన్.. మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు గుర్తొచ్చిన టమాటా రైతులు.. అధికారంలోకి వచ్చాక కనిపించకపోవడం దారుణమని లోకేశ్ విమర్శించారు. మదనపల్లి.. ఆసియాలోనే అతిపెద్దదైన టమాటా మార్కెట్ గా పేరొందిందని.. ఇక్కడి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇవీ చదవండి :