yuvagalam padayatra : కులాల వారీగా బీసీలను విభజించి రాజకీయాలకు వాడుకున్న వ్యక్తి జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 42వ రోజు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోట మండలం మొగసాలమర్రి వద్ద బీసీ నాయకులతో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. బీసీ సామాజికవర్గం ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను లోకేశ్ దృష్టికి తెచ్చారు. వాటిని పరిశీలించిన లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనాభా గణన జరగాలని, బీసీల శాతం వెల్లడవ్వాలని పార్లమెంట్లో పోరాడింది టీడీపీ మాత్రమేనని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. విశ్వబ్రాహ్మణులకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తానన్న జగన్ మోసం చేశారని గుర్తుచేశారు.
బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ..టీడీపీ అధికారంలోకి వచ్చాక విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. బీసీ నాయకులనే కాకుండా సామాన్యులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. బీసీలకు మెరుగైన విద్య అందించడానికి టీడీపీ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు. వడ్డెర్లను ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే అని చెప్పారు. ఆదరణ పథకం కింద కొనుగోలు చేసిన పరికరాలు సీఎం జగన్ పంపిణీ చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్ విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ నుంచి 24 శాతానికి జగన్ తగ్గించారని ఆరోపించారు.
ఇప్పుడున్న లెక్కలు చూస్తుంటే భయంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంపై 10లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ ప్రభుత్వం.. మరో ఏడాది రెండు నెలలు అధికారంలో ఉండే అవకాశాలున్నాయి. అంటే.. ఇంకో 2లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం ఉంది. ఆయా అప్పులకు సంవత్సరానికి మనకు అయ్యే వడ్డీ లక్షా 20వేల కోట్లు. అంటే ఆదాయం అంతా వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. ఎమ్మార్వో, ఆర్డీఓ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేదని కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రేపో మాపో పోలీస్ స్టేషన్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. పేపర్ లేదు.. పెన్నూ లేదు. కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. నిన్న ఒక ఐఏఎస్ అధికారి ఏమన్నాడంటే.. మా జీతాలు ఆపినా సరే గానీ, ముందుగా ఆయాలకు చెల్లించండి అని అన్నారు. అంటే.. ఐఏఎస్ అధికారులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. ఈ ఏడాది పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదు. కానీ, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో మాదిరిగా పెండింగ్ బిల్లులు చెల్లించి తీరుతుంది... పాలిచ్చే ఆవును వద్దనుకుని దున్నపోతును తెచ్చుకున్నాం.. భారత దేశ చరిత్రలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని ఒప్పుకున్న తొలి రాష్ట్రం మనదే.. తొలి ముఖ్యమంత్రి కూడా జగన్ మోహన్ రెడ్డే. - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
టమాట రైతు సమస్యలు తెలుసుకుని...యువగళం పాదయాత్రలో బి.కొత్తకోట మండలం పామూరివారిపల్లెలో టమాట రైతుతో లోకేశ్ మాట్లాడారు. తాము పడుతున్న కష్టాలను రైతు రమణప్ప లోకేశ్‌కు వివరించారు. నకిలీ పురుగు మందులతో నష్టపోతున్నామని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయాభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం దిశగా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు. టమాట ప్రాసెసింగ్ యూనిట్తో పాటు.. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పాదయాత్ర కుమ్మరిపల్లె చేరుకోగా.. గ్రామస్తులు తమ సమస్యలను లోకేశ్‌కు వివరించారు.
ఇవీ చదవండి :