TDP LEADERS FIGHT: అన్నమయ్య జిల్లా నియోజకవర్గాల తెదేపా సమీక్ష సమావేశంలో అధినేత చంద్రబాబు ఎదుటే పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. చంద్రబాబు సమీక్ష సమావేశం హాల్లోకి రాగానే వివిధ నాయకుల అనుచరులు వ్యక్తిగత పేర్లతో నినాదాలు చేశారు. వారిని చంద్రబాబు వారిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజంపేట నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బత్యాల చెంగల్‌రాయుడు, జగన్మోహన్‌రాజుల అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడం చూసి ఆగ్రహించారు. రైల్వేకోడూరు నియోజకవర్గం సమీక్షలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు వర్గీయులు బత్యాల చెంగల్‌రాయుడు వర్గీయుల మధ్య నినాదాలు జోరుగా సాగాయి. రైల్వేకోడూరు సమావేశంలో రాజంపేట కార్యకర్తలు పాల్గొని చెంగల్‌రాయుడుకు అనుకూలంగా నినాదాలు చేయడంతో వారిని బయటకు వెళ్లాలని అధినేత ఆదేశించారు. వారు వెళ్లకపోవడంతో బత్యాల వచ్చి తన అనుచరులను నియంత్రించడంతో సద్దుమణిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గ సమీక్ష చివర్లో శంకర్‌యాదవ్ గురించి చెబుతుండగా ఆయన అనుకూల, వ్యతిరేక వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు. ఈలోగానే చంద్రబాబు పుంగనూరు సమీక్ష మొదలుపెట్టారు. పుంగనూరు నియోజకవర్గ బాధ్యుడు చల్లా బాబును అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో అక్కడే ఉన్న బోయకొండమ్మ ఆలయం కమిటీ మాజీ ఛైర్మన్ ఎస్‌కే రమణారెడ్డి తన వర్గీయులతో చల్లా బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ గందరగోళంగా మారడంతో రమణారెడ్డి తన వర్గీయులతో బయటకు వెళ్లిపోయారు. చివరిగా మదనపల్లె సమీక్ష సమావేశం జరిగే సమయంలో కొందరు నేతలు స్థానికంగా ఉండట్లేదని.. బెంగళూరు, హైదరాబాదులో ఉంటూ కార్యకర్తల కష్టాలు పట్టించుకోకపోతే రేపు ఎన్నికల్లో ఎలా గెలుస్తారని కార్యకర్తలు ప్రశ్నించారు. పీలేరు నియోజకవర్గంలో సమీక్ష మాత్రం కిశోర్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని చెప్పినా ఎలాంటి నినాదాలు వినిపించలేదు.
పెద్దిరెడ్డి అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటాం
‘పుంగనూరు నియోజకవర్గం తెదేపాకు కంచుకోట. ఇక్కడున్న ఆరు మండలాల్లో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలున్నారు. వచ్చే ఎన్నికల్లో 100కు 150 శాతం ఇక్కడ గెలుస్తాం. మూడేళ్లుగా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదుచేసి వేధిస్తున్నారు. పోలీసుల సాయంతో వైకాపా నాయకులు.. తెదేపా కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా వీరోచితంగా పోరాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ అరాచకాలకు వడ్డీతో చెల్లిస్తాం’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘కార్యకర్తలు సింహాల్లా బయటకొచ్చి వైకాపా అక్రమాలను ప్రశ్నిస్తుండటంతో మంత్రి పెద్దిరెడ్డిలో భయం మొదలైంది. అధికార పార్టీ నాయకుల తీరుపై ప్రజలు తిరగబడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికే ఎమ్మెల్యేలు, ఎంపీల పదవులతో పాటు గుత్తేదారు పనులూ కావాలా? గండికోట ప్రాజెక్టు రూ.4,800 కోట్లు. అది కూడా మంత్రికే కావాలా’ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి స్వాహాచేసిన ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటామన్నారు.