Remand Prisoner Suicide: జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా పీలేరు మండల కేంద్రంలోని సబ్ జైలులో చోటు చేసుకుంది. పీలేరు సబ్ జైలర్ తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ ముడుపుల వేములవారిపల్లెకు చెందిన రాజేష్ నాయక్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఓ మైనర్‌పై అత్యాచారం చేసి, గర్భవతి కావడానికి కారకుడయ్యాడని ఈ ఏడాది మార్చి 25వ తేదీన చిత్తూరు జిల్లా రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం రాజేష్ నాయక్‌ను రిమాండ్‌కు తరలించారు. అప్పటినుండి పీలేరు సబ్ జైల్లో ఉన్న రాజేష్ నాయక్ (32) ఈరోజు తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న రాజేష్‌ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారని చెప్పారు. విషయం తెలుసుకున్న రాజేష్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు.